ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని ఏపీ ప్రజానీకం ఎదురుచూస్తున్నారు – మాజీ మంత్రి ప్రత్తిపాటి.
రేపటి సభలో ప్రధాని మోదీ రాష్ట్ర దశ-దిశ మార్చేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, సమర్థతకు తోడ్పాటునిచ్చేలా కేంద్ర సహాయసహాకారం అందిస్తారనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలున్నారు – పుల్లారావు.
విశాఖలో నేడు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ, రోడ్ షో నిర్వహణా ఏర్పాట్లను మంగళవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సాయంత్రం ప్రధాని బహిరంగసభ జరగనుంది. సభానిర్వహణ, రోడ్ షో లో భాగంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి ప్రభుత్వం జీ.వీ.ఎం.సీ పరిధిలోని కొన్ని వార్డులతో పాటు, పెందుర్తి నియోజకవర్గ భాద్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆయన సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భారీ స్థాయిలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పనపై ఆయన కూటమినేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పుల్లారావు మాట్లాడుతూ…
మంత్రి లోకేశ్ ఇప్పటికే సభా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, విలువైన సూచనలు చేశారన్నారు. గతంలో తన ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని మోదీ సభ భారీస్థాయిలో విజయవంతమైందని, దాన్ని మించి విశాఖ సభ విజయవంతమయ్యేలా, లోకేశ్ ఆదేశాల ప్రకారం అందరం సమన్వయంతో కలిసి పనిచేద్దామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ, రోడ్ షో చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం కావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల ఆకాంక్ష అని మాజీ మంత్రి చెప్పారు. ప్రధానంగా ఉత్తరాంద్ర ప్రాంత కూటమి నాయకులు ప్రధాని పర్యటనను దిగ్విజయం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వ అవినీతి, ఆర్ధిక విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని, అస్తవ్యస్తమైన పాలనను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, సమర్థత, ముందుచూపు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వాటికి ప్రధాని మోదీ ఉదారత, కేంద్ర సహకారం తోడైతే మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మాజీ మంత్రి తెలిపారు. ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రోడ్ల నిర్మాణం – మరమ్మతులు సహా పలు కీలక నిర్ణయాలతో ముఖ్యమంత్రి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను పెంచారని పుల్లారావు అభిప్రాయపడ్డారు. అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రానికి మోదీ పర్యటన కొత్త ఊపిరి పోస్తుందనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఈ నేపథ్యంలో మనందరం పట్టుదలతో ప్రధాని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పుల్లారావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న ప్రధాని పర్యటన కాబట్టి, కూటమి ప్రభుత్వం బలంగా ఉందనే సంకేతాలు దేశమంతా తెలిసేలా కార్యక్రమం జరగనుందన్నారు. ఈ సభ విజయవంంతంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజలతో పాటు మనందరిలో ఉందన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి తక్కువలో తక్కువగా 40వేల మంది తరలివెళ్లేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రధాని సభకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చిలకలూరిపేటలో దాదాపు 350 ఎకరాల్లో తన నాయకత్వంలో గతంలో ప్రధానిసభ జరగిందని, సభకు తరలివచ్చిన లక్షలాది జనాన్ని చూసి మోదీనే ఆశ్చర్యపోయారని మాజీ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత చేయూత అందించేలా ప్రధాని సహాయసహకారాలు ఉంటాయన్న పుల్లారావు, రాష్ట్ర దశ దిశ మార్చే పలు కీలక నిర్ణయాలు, ఆర్ధిక ప్యాకేజ్, రాయితీలు వంటి వాటిని ప్రధానే స్వయంగా ప్రకటిస్తారని ఆంధ్రా ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.