SAKSHITHA NEWS

ప్రజల ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ప్రజల ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మండల స్థాయి ప్రజావాణి, బుధవారం పాఠశాల భోజనం, కలెక్టరేట్ లో సౌకర్యాల కల్పనపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 90 శాతం ప్రజా సమస్యలు గ్రామ, మండల స్థాయిల్లోనే పరిష్కారం అవుతాయని, మండల అధికారులు చర్యలు చేపట్టకపోవడం, స్పందించకపోవడంతో కలెక్టరేట్ కు వస్తాయన్నారు. పరిపాలనలో ప్రతి స్థాయిలో విధులు, బాధ్యతలు వుంటాయని, ఎవరి విధులు, బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. గత సోమవారం నుండి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు, సమయం, డబ్బు వృధా కాకుండా, మండల తహసీల్దార్ కార్యాలయంలో అర్జీల స్వీకరణ చేస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో స్వీకరించిన ఆర్జీలు వేగంగా పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

గత సోమవారం ప్రజావాణి లో జిల్లా వ్యాప్తంగా 536 అర్జీలు స్వీకరించినట్లు, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 363 అర్జీలు ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లా అధికారులు, తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలు, ఏ సమస్యలతో ఉన్నాయో మండలాల వారిగా పరిశీలించి, శుక్రవారం లోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శుక్రవారం ఉదయం పరిష్కారం అయినవి, కానివి పరిశీలించి, పరిష్కారం, తిరస్కరణ క్వాలిటీగా జరిగింది తనిఖీ చేయాలన్నారు. పరిష్కారంపై పర్యవేక్షణ, సమీక్ష చేయాలని ఆయన తెలిపారు. ప్రతి బుధవారం పాఠశాల భోజనం కార్యక్రమం జిల్లాలో చేపట్టినట్లు, జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేయడం, పాఠశాలలో కనీస మౌళిక వసతులు, విద్యా ప్రమాణాల తనిఖీలు చేయడం జరుగుతున్నట్లు ఆయన అన్నారు. అధికారులు పాఠశాలలో స్టోర్ రూమ్ తనిఖీ చేయాలని, స్టాక్ రిజిష్టర్ ప్రకారం బియ్యం, సామాగ్రి తనిఖీ చేయాలని, నాణ్యతను పరిశీలించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి గురించి తనిఖీలు చేయాలన్నారు. పాఠశాలల్లో బేధభావాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు బియ్యం, భోజనం నాణ్యతను పరిశీలించాలన్నారు. కలెక్టరేట్ గేటువద్ద బస్ స్టాప్ పనులు జరుగుతున్నట్లు, ప్రతి బస్ కలెక్టరేట్ వద్ద ఆగేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. త్రాగునీటికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్ లో మందులతో డిస్పెన్సరీ ని, ఉమెన్ బ్రీస్ట్ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. బ్యాంక్ అన్ని సదుపాయాలతో 15 రోజుల్లో ప్రారంభం చేయనున్నట్లు, క్యాంటీన్ వారం రోజుల్లో తెరవనున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు, సిబ్బందికి సౌకర్యాల కల్పన చేసి, తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 06 at 18.06.22

SAKSHITHA NEWS