పెండింగ్ భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి…

Sakshitha news

పెండింగ్ భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి…

నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో జాప్యం ఉండొద్దు….

– మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేలా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణపై సమీక్షించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్ భూసేకరణను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని వెల్లడించారు. కొత్త ఆయకట్టు సృష్టించే లక్ష్యంతో భూసేకరణ, పునరావాస పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిధులు అందుబాటులో ఉన్నందున భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లాలో చేపడుతున్న భూసేకరణ వివరాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంత్రికి వివరించారు. ధర్మారం మండలం కానంపల్లి గ్రామంలో నూతన చెరువు (ఎఫ్‌ఎన్‌టీ) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రూ.5.40 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. త్వరలోనే రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, డీఈ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top