అమరుడు కామ్రేడ్ నాగన్న సంతాప సభ కరపత్రం విడుదల…
జూలై 19న ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో సభ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ జ్యోతినగర్, ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఈ నెల 19న. నిర్వహించనున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాగన్న సంతాప సభకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ చిలుక శంకర్ మాట్లాడుతూ, కామ్రేడ్ నాగన్న (పరకాల నాగన్న) విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ప్రజా కళాకారుడని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజాం గ్రామంలోని నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన నాగన్న చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు.
1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాలం నుంచి రైతాంగ పోరాటాల్లో చురుకుగా పాల్గొంటూ, తన మధురమైన గాత్రంతో రైతులు, కూలీలు, పీడిత ప్రజల సమస్యలను ప్రతిబింబించే విప్లవ గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని కొనియాడారు. 1980 నాటికే ప్రజా కవి, గాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు అమరుడు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు, కామ్రేడ్ రామారావు అన్నల సాన్నిహిత్యంలో ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు సేవలందించారని పేర్కొన్నారు.
గత 46 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న నాగన్న, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తన బాధ్యతలను నిర్వర్తించారని తెలిపారు. చివరకు ఈ నెల జూలై 3, 2026న తుదిశ్వాస విడిచి అమరుడయ్యారని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ముఖ్యంగా కోల్‌బెల్ట్ ప్రాంతంతో నాగన్నకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని, కార్మిక ఉద్యమాలు, బహిరంగ సభల్లో తన ఆటపాటలతో కార్మికులను చైతన్యపరిచారని గుర్తు చేశారు. ఆయన ఆలపించిన విప్లవ గీతాలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
కామ్రేడ్ నాగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో జూలై 19 (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద నిర్వహించే సంతాప సభకు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మికులు, కవులు, రచయితలు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బి. బుచ్చన్న, పి. స్వామి, ఆర్. రాయమల్లు, పి.వెంకటస్వామి, చందు, డి.నర్సయ్య, చిరంజీవి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
