ఒంటరి మహిళా రైతులకు ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకం…..
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టే ఒంటరి మహిళా రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా నాణ్యమైన మొక్కల సరఫరాతో పాటు అంతర పంటల సాగు, తోట నిర్వహణ కోసం నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం రాయితీలు అందజేస్తోందన్నారు. ఈ పంట ద్వారా రైతులు దీర్ఘకాలికంగా స్థిరమైన, అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లాలో పట్టా భూమి కలిగి ఆయిల్ పామ్ సాగు చేయదలచిన ఒంటరి మహిళా రైతులకు ప్రభుత్వం అందించే నాలుగేళ్ల రాయితీలతో పాటు, రైతుకు అయ్యే అదనపు వ్యయాన్ని జిల్లా కలెక్టర్ ఆధీనంలోని నిధుల ద్వారా ప్రత్యేక రాయితీగా అందించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడం, రైతులను లాభదాయక ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడం, అలాగే ఒంటరి మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించడం ఈ ప్రత్యేక పథకం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ వివరించారు.
అర్హులైన ఒంటరి మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ సాగు చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సమీప ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
