ఉద్యమకారుల హామీల అమలుపై ప్రభుత్వానికి నిలదీత
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి 250 గజాల ఇల్లు కేటాయించడం, గుర్తింపు కార్డులు అందించడం, పెన్షన్ మంజూరు చేయడం, తగిన గౌరవం కల్పించడం వంటి అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా, ఈ హామీల అమలుపై స్పష్టత లేకపోవడం ఉద్యమకారుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుందని ఆశించినప్పటికీ, అది కూడా జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ సాధన కోసం ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసిన ఉద్యమకారులను విస్మరించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యమ ఫలితంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఉద్యమకారుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని, ఉద్యమకారుల గుర్తింపు కోసం వెంటనే సబ్‌కమిటీ ఏర్పాటు చేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఉద్యమకారులపై అక్రమ అరెస్టులు జరగడం పట్ల కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని కోరారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలసి ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రచయిత : కుసుమ సిద్దారెడ్డి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY