రూ.3 కోట్లతో బందంపల్లి మినీ ట్యాంక్ బండ్….
తీగల వంతెనతో పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దుతాం…
–ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, పెద్దపల్లి పట్టణాన్ని మరింత సుందరంగా, ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బందంపల్లి చెరువు కట్ట వద్ద రూ.3 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బందంపల్లి చెరువు వద్ద ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రారంభమైన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చెరువు కట్టను ఆధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మినీ ట్యాంక్ బండ్‌కు అదనపు ఆకర్షణగా తీగల వంతెన (రోప్ బ్రిడ్జ్) నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. చెరువు కట్ట అభివృద్ధికి అవసరమైతే అదనపు నిధులు కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించినట్లు తెలిపారు. త్వరలోనే మినీ ట్యాంక్ బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, దశలవారీగా పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్, సంబంధిత శాఖల అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
