సింగరేణి కళాకారులకు సంగీత వాయిద్యాలు, సాధనకు ప్రత్యేక గది కల్పించాలి….
–ఆర్జీ-2 జీఎంకు కళాకారుల వినతి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కళాకారులకు సంగీత వాయిద్య పరికరాలు, కాస్ట్యూమ్స్ అందజేయడంతో పాటు సాధన కోసం ప్రత్యేక గదిని కేటాయించాలని ఆర్జీ-2 సింగరేణి ఉద్యోగ కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జీఎం బండి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ క్రీడాకారులకు ఎన్నో సంవత్సరాలుగా క్రీడా సామగ్రిని అందజేస్తున్నప్పటికీ, కళాకారులకు మాత్రం ఇప్పటివరకు సంగీత వాయిద్య పరికరాలు, కాస్ట్యూమ్స్ వంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని పేర్కొన్నారు.
ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సింగరేణి, కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో అనేక బహుమతులు సాధించి సంస్థకు పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే సింగరేణి డే ఉత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, రక్షణ వారోత్సవాలు తదితర కార్యక్రమాల్లో కళాప్రదర్శనలు ఇస్తూ కార్మికుల్లో చైతన్యం కల్పిస్తున్నామని వివరించారు.
వార్షిక క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యేలోపు కళాకారులకు అవసరమైన సంగీత వాయిద్య పరికరాలు అందజేయడంతో పాటు, సీఈఆర్ క్లబ్‌లో సాధన కోసం ప్రత్యేక గదిని కేటాయించాలని కోరారు. దీనిపై జీఎం బండి వెంకటయ్య సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగ కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కనకం రమణయ్య, ఉపాధ్యక్షుడు బోయిన రాజారాం, ప్రధాన కార్యదర్శి బుంభక్ రాకేష్, సంయుక్త కార్యదర్శి కోల కృష్ణస్వామి, సహాయ కార్యదర్శి తాళ్లపెల్లి నారాయణ, కోశాధికారి గీసల రామారావు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
