SAKSHITHA NEWS

చిలకలూరిపేటకు ఈ నెల 20 లోపే ఎన్టీఆర్ సుజల స్రవంతి: ప్రత్తిపాటి

నీతి, నిలకడ లేని రాజకీయాలతో అభివృద్ధికి తీరనిచేటు: ప్రత్తిపాటి

చిలకలూరిపేట ప్రజలకు ఈ నెల 20లోపే ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా సురక్షిత మంచినీరు అందించబోతున్నామని ప్రకటించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఈ నెలాఖరులోపు శివారు ప్రాంతాలు సహా అందరికీ శుద్ధిచేసిన మంచినీళ్లను అందించబోతున్నామన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో స్థానిక అవినీతి మంత్రి నిర్వాకాల కారణంగా నిలిచి పోయిన పథకాన్ని తాము వచ్చిన స్వల్ప వ్యవధిలోనే పూర్తిస్థాయిలో పున:ప్రారంభించబోతున్నందు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారాయన. అలాంటి నీతి నిలకడలేని మనుషులు, రాజకీయాల వల్ల ఎంతో చేటో, అభివృద్ధికి ఎంత విఘాతమో గమనించాలని కోరారు. చిలకలూరిపేట ప్రజల దాహార్తి తీర్చేలా సురక్షిత, మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పున:ప్రారంభానికి సంబంధించిన పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని మంచి నీటిచెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ వద్ద నీటి శుద్ధి యంత్రాలకు జరుగుతున్న మరమ్మత్తుల వద్దకు స్వయంగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పట్టణపరిధిలో శివారు ప్రాంత ప్రజలకు సైతం మినరల్ వాటర్ ను సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ పునర్నిర్మిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అలసత్వం, వేరేవాళ్లకు పేరు రాకూడదన్న కుళ్లు రాజకీయం కారణంగానే లక్షణమైన ప్లాంట్ ఈ దుస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా నిరుపయోగంగా ఉంచడం వల్ల మరమ్మత్తులకు కూడా పనికిరాని స్థితికి చేరిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా విడదల రజినీ చేసిన పాపాలకు ఇది మరో నిదర్శనమన్నారు. ప్రజలు ఎలా పోయినా నాకేంటి అనేరీతిలో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందే ఈ నియోజకవర్గాన్ని కూడా వదిలేసి పోయిన మనిషి మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నా రో కూడా అర్థం కావడం లేదన్నారు. ఆ రోజు ప్రజలు దాహంతో ఉండకూడదని సొంతడబ్బుల్తో అయినా పథకాన్ని నడిపిద్దామనుకుంటే తప్పుడు కేసులతో వేధించాలని చూసింది ఎవరు మరిచి పోలేదన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. తెలుగుదేశం గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రజల దాహార్తి గమనించి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించినప్పుడే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనే లక్ష్యంతో ఎన్టీఆర్ సుజలాస్రవంతి ప్లాంట్ ను ఆ నాడు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో కుప్పం తరువాత చిలకలూరిపేటలోనే ఈ పథకం పునః ప్రారంభిస్తున్నామని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని సురక్షిత నీటిని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.ఈ కార్యక్రమంలో ప్లాంట్ ఆర్గనైజర్ రామకృష్ణ , పేట మండల అద్యక్షులు జవాజి మదన్,నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 11 10 at 11.57.05 PM

SAKSHITHA NEWS