వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం. తాడేపల్లి.
మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రెస్‌మీట్:
అది ములాఖత్ కాదు.. మిలాఖత్.
సెంటిమెంట్ కాదు.. సెటిల్‌మెంట్
: జైల్లో బాబు, పవన్ భేటీ గుట్టు విప్పిన శ్రీ పేర్ని నాని
జైల్లో పరామర్శకు వెళ్లావా..? బేరం మాట్లాడుకోడానికి వెళ్లావా..?
చంద్రబాబుతో ఏం మాట్లాడుకుని వచ్చావ్..?
నీ పార్టీ జెండా మోసే సైనికులకైనా చెప్పాలి కదా..?
: సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని
బీజేపీతో తాత్కాలికం.. టీడీపీతో శాశ్వతం.. అదే వాస్తవం
పవన్‌కల్యాణ్ ఎప్పుడూ క్లారిటీతోనే ఉన్నాడు
క్లారిటీ లేకుండా పిల్లిమొగ్గలు వేస్తున్నది బీజేపీనే
చివరికి బీజేపీ బతుకు తాత్కాలికం అయ్యింది.
పవన్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ప్రకటించడం పెద్ద జోక్
అమావాస్య రోజున పొత్తు ఒక ‘శుభ’ సూచికం
: మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని వెల్లడి
అసలు నీ సిద్ధాంతం ఏమిటి పవన్ కల్యాణ్?
అవినీతిపై పోరాటం అని నీ జెండా మోసే పిల్లలకు చెప్తావు
జనం సొమ్ము దోచిన వ్యక్తిని పరామర్శిస్తావా..?
ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం సిద్ధాంతాలు కలిశాయి..?
మీ తమ్ముడు లోకేశ్, బాబాయ్ బాబు దొంగలు అన్నావ్..
దోచేసిన డబ్బంతా హెరిటేజ్‌లో పెడుతున్నారు అన్నావ్.
మరి ఆ దొంగలతో ఎందుకు కలిశావో ప్రజలకు చెప్పు
: మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని స్పష్టీకరణ
వైఎస్సార్సీపీ వాళ్లని ఎవ్వరినీ వదలనంటున్నావు
నీకు చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్..
తెరమీద హీరోగా కొనసాగు.. రాజకీయాల్లో జోకర్ వేషాలు ఎందుకు..?
బాలకృష్ణ ఏం మాట్లాడారో నీకు గుర్తు లేదా పవన్..?
బాలకృష్ణ తన మాటలకు కట్టుబడితే మీతో వెళ్లకూడదు కదా..?
మీరెన్ని గుంపులు కట్టి వచ్చినా ఏమీ చేయలేరు
జనం గుండెల్లో జగన్‌గారి స్థానం సుస్థిరం
: ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని
తాడేపల్లి:
అలా వెళ్లిపోతాడనుకున్నారు:
చంద్రబాబు రూ. 300 కోట్లు అవినీతి సొమ్ము తింటే తిన్నాడు.. నోవాటెల్‌లో నన్ను పలకరించి వెళ్లాడు కదా అని పవన్ కల్యాణ్ ఓదార్పుకు వెళ్తున్నాడని అనుకున్నాం. వాస్తవంగా నోవాటెల్‌కి వచ్చాడని, పుంగనూరు ఘటన తర్వాత పవన్ బాబును పలకరించడానికి ఇంటికి వెళ్లాడు. చెల్లుకు చెల్లయింది. అప్పుడు కానిస్టేబుల్ కొడుకు దెబ్బలు తిన్న కానిస్టేబుళ్లను కాకుండా వాళ్లని కొట్టిన బాబును పరామర్శించాడు. మళ్లీ ఇప్పుడు కొత్తగా జైలుకు వెళ్తున్నాడేంటి అనుకున్నారు అందరూ.
జైలుకు వెళ్లి పలకరించి విచారంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానం ఎక్కి వెళ్లిపోతాడు అనుకున్నారు.
అసలు అక్కడికి ఎందుకు వెళ్లావ్?:
రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లావా? లేక బేరం మాట్లాడటానికి వెళ్లావా? లేక సీట్లు మాట్లాడుకోడానికి వెళ్లావా? అసలు ఏ డీల్ మాట్లాడుకోవడానికి బాబును కలవడానికి వెళ్లావ్?. మరి డీల్ కుదిరిందా? లేదా? ఇవన్నీ ప్రజలకు చెప్పాలి కదా. అంతా నీ ఇష్టమేనా?. నేను సీఎంని అని కాసేపు, నాకు ప్రభుత్వం ఇవ్వండి.. నేనొస్తే ఏదో చేస్తానని నిన్నటి వరకూ మాట్లాడావు.
అధికారికంగా రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి క్రిమినల్ ప్రిజనర్ నంబర్ 7691ని ములాఖత్ పేరుతో కలవడానికి ముగ్గురు వస్తున్నారని, వారిలో పవన్ కల్యాణ్ ఉన్నాడని చెప్పారు. వారు వెళ్లి బయటకు వచ్చాక అర్ధం అయ్యింది ఏంటంటే.. ఇది ములాఖత్ కాదు.. మిలాఖత్ అని.
పవన్‌కల్యాణ్ ఈ మధ్య హిందువుని అని చెప్పాడు. గతంలో ఒక మిత్రుడు నాకు బాíప్టిజం ఇచ్చాడు అన్నాడు. ఈ మధ్య కాలంలో కొత్తగా హిందూమతం తీసుకున్నాడు. హైందవ మతం తీసుకున్నాడు కాబట్టి సెంటిమెంట్‌గా పాత ఫ్రెండ్‌ని ఓదార్చడానికి వెళ్లాడని అనుకున్నాం.
కానీ ఇది సెంటిమెంట్ కాదు.. సెటిల్‌మెంట్ కోసం వెళ్లాడని అర్ధం అయ్యింది.
పిల్లి మొగ్గలేస్తుంది బీజేపీనే:
2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి అన్నాడు. బీజేపీ ప్రస్తుతానికి మాత్రమే మాతో పొత్తులో ఉంది అన్నాడు. అంటే బీజేపీతో తాత్కాలికం.. టీడీపీతో శాశ్వితం అని దానర్ధం. పవన్‌కల్యాణ్ ఎప్పుడూ క్లారిటీతోనే ఉన్నాడు. క్లారిటీ లేకుండా పిల్లమొగ్గలు వేస్తున్నది మాత్రం బీజేపీ.
2014లో మోదీగారి కోసం తాను అన్నయ్యను వదిలి వచ్చానని చెబితే నిజమని నమ్మారు. వాస్తవానికి మోదీ పేరుతో చంద్రబాబుకు ప్రచారం చేయడానికి వచ్చాడు. 2018లో చంద్రబాబు చెవిలో ఏం చెప్పాడో.. బీజేపీ, చంద్రబాబు కాదు. నాకు కమ్యూనిస్టులు, బీఎస్పీ ముఖ్యం అని అన్నాడు. అప్పుడు కూడా పిల్లిమొగ్గ వేసింది బీజేపీ వారే.
బీజేపీ బతుకు తాత్కాలికం:
ఎన్నికలు అయిపోగానే ఇన్‌కం ట్యాక్స్ వారు షాపూర్జీ పల్లోంజీ కంపెనీపై రైడ్ చేస్తే రూ. 2 వేల కోట్లు దొరికాయని, అందువల్ల పవన్ వెళ్లి, తనను కాపాడాలని చంద్రబాబు ఆయనను కోరారు. అప్పుడు పవన్ మళ్లీ బీజేపీవైపు వెళ్లారు. కనీసం అప్పుడన్నా బీజేపీ వారు ఆలోచించాలి కదా? పవన్ తమ నుంచి ఎందుకు వెళ్లాడు? మళ్లీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? అని. మొత్తంమీద బిజేపీ బతుకు తాత్కాలికం అయింది.
అది ‘శుభ’ సూచికం:
2024లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్‌కళ్యాణ్ చెప్పారు. దాన్ని ఒక పెద్ద బ్రేకింగ్‌లా చెప్పాడు. కానీ ఎవరికి తెలియదు. అది పాచి కబురే కదా?.
భీమవరంలో పోటీ చేసినప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో కలవడానికి హిందూ మతం తీసుకున్నాడు.
హిందూ మతంగా ఈరోజు మంచి సెంటిమెంట్. మంచి అమావాస్య రోజున ఇద్దరం పొత్తు చేసుకుంటున్నాం అని చెప్పాడు. అది ‘శుభ’ సూచికం.
ఆ ప్రకటన పెద్ద జోక్:
లోకేశ్ వచ్చి నేను టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి మద్దతు ప్రకటిస్తున్నా అంటే ఎలా ఉంటుందో.. సరిగ్గా పవన్ కల్యాణ్ మాట్లాడింది కూడా అలానే ఉంటుంది. వారిద్దరు మాట్లాడే వాటిలో ఏమైనా తేడా ఉందా? రెండూ హాస్యాస్పదమే. పవన్ కొత్తగా టీడీపీకి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది?. మేం కలిసి వెళుతున్నాం అని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఇది ఒక జోక్ కాదా?.
పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి టీడీపీలో అంతర్భాగం అనేది ప్రపంచానికి తెలిసిన నిజం. కలిసి వెళ్లడం.. విడిపోవడం.. ఇవన్నీ ముసుగు కార్యక్రమాలు.
వారికైనా చెప్పాలి కదా?:
పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు ఏమిటో పూర్తిగా తెలుసు. ఆయన వాడుకుని వదిలేస్తాడని నాకు తెలియదా? అని గతంలో పవన్ స్వయంగా చెప్పారు. మరి వాడితో పొత్తుకు ఎందుకు వెళ్తున్నావ్?
జైల్లో చంద్రబాబుతో ఏం మాట్లాడుకుని వచ్చావ్?. వ్యాపారమా? ప్రజలకు చెప్పాలి కదా?. కనీసం జనసేన జెండా మోస్తున్న అమాయకపు జనసేన కార్యకర్తలకన్నా చెప్పాలి కదా?.
పవన్ తంతు అలా ఉంది:
బీహార్ లాంటి చోట జైళ్లలో చాలా మంది మాఫియా డాన్‌లు ఉంటే వెళ్లి డీల్స్ మాట్లాడుకుని వస్తారు. ఓదార్పు అయితే చాలా విచారిస్తున్నాను. 45 ఏళ్ల ఇండస్ట్రీ జైళ్లో ఉన్నాడు. నూరు కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకు పడిపోయింది.బాధపడుతున్నాను అని వెళ్లిపోవాలి. కానీ అది మాట్లాడకుండా ఇదెందుకు మాట్లాడావ్..? అంటే లోపల డీల్ మాట్లాడుకున్నట్లే కదా? వెనుకటికి ఎవడో చావు పలకరింపునకు వచ్చి పెళ్లికి లగ్గం పెట్టుకొచ్చాడట. సరిగ్గా పవన్ తంతు కూడా అలాగే ఉంది.
చంద్రబాబుపై తాను ఏనాడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఆయనకు, తనకు ఎలాంటి విభేదాలు లేవు. చంద్రబాబుతో తనకు
జూబ్లీహిల్స్, మణికొండలో ఎక్కడా ఆస్తి తగాదాలు లేవంటాడు. కేవలం సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయంటాడు. సిద్ధాంతపరంగానే చంద్రబాబుతో విభేదించానని పవన్ చెబుతున్నారు.
అసలు నీ పార్టీ సిద్ధాంతం ఏమిటి?:
పవన్‌కళ్యాణ్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు. పచ్చి అవినీతి పార్టీ, ఈ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు అని పవన్ ఇదే చంద్రబాబును అన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద నిరుద్యోగ పిల్లలకు నైపుణ్యం నేర్పుతానని మోసం చేసి రూ. 370 కోట్లు దొంగతనం చేసిన దొంగను పలకరించడానికి వెళ్లావు. చంద్రబాబుతో నీకు సిద్ధాంతపరమైన విభేదమా..? అసలు నీ సిద్ధాంతం ఏమిటి.?
అవినీతిపై పోరాటం అని నీ జెండా మోసే పిల్లలకు చెప్తావు..నువ్వు పరామర్శించేది ఎవర్ని..? జనం సొమ్ము దోచేసిన వ్యక్తినా.? వాళ్లతో పొత్తులు పెట్టుకుని మళ్లీ మేం పోటీ చేస్తాం అంటున్నావు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం సిద్ధాంతాలు కలిశాయి..? అంతటి అవినీతి పరుడిని ఎందుకు పరామర్శించడానికి వెళ్లావు..కలిసి పోటీ చేస్తానంటున్నావ్..?
నీ హార్డ్ డిస్క్ నుంచి చంద్రబాబుపై ఉన్న అవినీతి ఫైళ్లు తీసేశావా..? లేక నటిస్తున్నావా..?
సినిమాల్లోనే కాదు..నీ నటనతో ప్రజలను వంచన చేస్తున్నావు అనడానికి ఇంతకంటే తార్కాణం ఏముంది..? ఇక ప్యాకేజీ అంటే నీకు పొడుచుకొచ్చేస్తుంది. జగన్మోహన్‌రెడ్డి గారు ఎక్కడన్నా దత్త పుత్రుడు అంటేనేమో నీకు పొడుచుకొస్తుంది. అక్కడేమే లోకేశ్ నిన్ను మా అన్నయ్య అంటాడు..నీ తమ్ముడి అవినీతి గురించి గతంలో నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చావో గుర్తుచేసుకో. తమ్ముడు ఐదేళ్లలో కొట్టేసిన దాంట్లో నీకేమన్నా ఇచ్చాడా..? తమ్ముడు, బాబాయి, తమ్ముడి మామగారు కలిసి జైళ్లో ఏం మాట్లాడుకున్నారు..? మాకొచ్చి సీట్లు పంచుకున్నాం అని చెప్తారా.. లోపలేమో లెక్కలు పంచుకున్నారా..? కనీసం జెండా మోసే కార్యకర్తలకన్నా చెప్పాలి కదా?
నీకు చేతనైంది చేసుకో పవన్:
బీజేపీ కూడా కలిసి రావాలి.. మనందరం కలిసి పోటీ చేయకపోతే ఇంకా 20 ఏళ్లు జగన్‌ను ఏమీ చేయలేం అంటాడు. మీరు ముగ్గురు కలిసినా కూడా జగన్మోహన్‌రెడ్డి గారిని 20 ఏళ్లపాటు ఏమీ చేయలేరనేది 2024 ఎన్నికల్లో మీకు అర్ధం అవుతుంది.
జైళ్లోకి వెళ్లి వచ్చి చంద్రబాబు స్కాం గురించి రెండు మాటలు మాత్రమే మాట్లాడాడు. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా..ఈ కేసులో ఈడీ, జీఎస్టీ శాఖలు రెండూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా రూ.240 కోట్లు స్కాం జరిగిందని చెప్పారు. చంద్రబాబు స్నేహితులు డిజైన్ టెక్, సుమన్ బోస్ అనేవారిని ముద్దాయిలను చేస్తే ఇప్పుడు బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. కానీ తనకేమీ తెలియనట్లు ఈ కేసు అన్యాయం అక్రమం అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వమే కేసు కట్టి కొంత మందిని అరెస్ట్ చేసింది. రేపో మాపో మన బాబాయిని కూడా ఎత్తుకెళ్లొచ్చు. బయటకు వచ్చి మాత్రం కలిసి వెళ్తాం. మాకు మాకు తగువులు లేవని చెప్తున్నాడు. లెక్కలు సరిచేసుకున్న వాడు ఇవన్నీ చెప్తాడు.
ఎందుకు విడిపోయారు. ఎందుకు కలుస్తున్నారు?:
మీ తమ్ముడ్ని దొంగ అన్నావ్..బాబాయ్‌ని దొంగ అన్నావ్..డబ్బంతా హెరిటేజ్‌లో పెడుతున్నారు అన్నావ్…ఒక రాజకీయ పార్టీ ఎందుకు విభేదించారో, కలిశారో చెప్పాలి కదా..సిద్ధాంతం అంటే అదే కదా..?
మేమేన్నా అనుమానిస్తే కానిస్టేబుల్ కొడుకునే అనుమానిస్తారా అంటాడు.
అసలు నువ్వు చిరంజీవి తమ్ముడివి కదా…సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కొడుకువి కదా..కానిస్టేబుల్ ఏంటి..? వైఎస్సార్సీపీ వాళ్లని ఎవ్వరినీ వదలడట…నీకు చేతనైంది చేయి అని వందసార్లు చెప్పాం.
జన సైనికులకు మోసం:
అసలు నీ పార్టీ ఫిలాసఫీ ఏంటి..? ఎందుకు ఇన్ని పార్టీలతో పొత్తు..? సిద్ధాంతం అంటే ఏంటి..? సీపీఐ వాళ్లను అడిగితే బీజేపీకి వ్యతిరేకంగా మేం ఎవరితోనైనా తిరుగతాం అంటారు. కాంగ్రెస్ పార్టీని అడిగితే బీజేపీతో తప్ప ఎవరితోనైనా తిరుగుతాం అంటారు.
పవన్ కల్యాణ్ నీ పార్టీ సిద్ధాంతం ఏమిటి..?
కమ్యూనిస్టు పార్టీతో తిరుగుతావు..కాంగ్రెస్ పార్టీతో తిరుగుతావు…
అన్నప్రాసం నాడే కత్తి, సుత్తి పట్టుకున్నానంటావ్…అమాంతం మాయవతి కాళ్లు పట్టుకుంటావ్..జిందాబాద్ అంటావు. మళ్లీ చంద్రబాబు అంటావు.. చంద్రబాబును తిడతావు.. మళ్లీ బీజేపీ అంటావు..మళ్లీ బీజేపీని వదిలేస్తావ్…మళ్ళీ చంద్రబాబు అంటావ్. నీది ఒక రాజకీయ పార్టీ.. దానికో జెండా.. గుర్తు.. పోటీ…సిగ్గు చేటు.
ఎందుకయ్యా జనసైనికులను వాడుకుని మోసం చేసి నువ్వు లాభ పడటం తప్ప ఏముంది..? జగన్ ప్రెస్‌మీట్ పెట్టడు అంటాడు..నువ్వు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏం పగలదీస్తున్నావు..? ఆయనెవరో టీ స్టాల్ పెట్టి కష్టపడి నీకు లారీ కొనిపిస్తే.. దానిపై ముచ్చటగా మూడు రోజులు మురిపించి మళ్లీ కనిపించలేదు. మళ్లీ బాబాయిని జైళ్లో వేస్తే కానీ బయటకు రాలేదు.
ప్రస్తుత డీజీపీ, చీఫ్ సెక్రటరీ గారు జాగ్రత్త అంటాడు. చంద్రబాబు వద్ద డీజీపీ, చీఫ్ సెక్రటరీలుగా చేసిన వారు బాగానే ఉన్నారుగా.
ఉడతూపులు మానేస్తే సినిమాల్లో హీరోగా ఉన్నావు.. బయట కూడా సామాన్యంగా అన్నా ఉంటే బాగుంటుంది. చిరంజీవి చూస్తే హీరోగా ఉన్నాడు.. చిన్నోడు ఇలా అయిపోయాడేంటి అని మాకు కూడా అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆ తెరమీద హీరోగా కొనసాగు…ఈ రాజకీయాల్లోకి వచ్చి జోకర్ వేషాలు ఎందుకు..?
లోకేశ్ అలా అనుకుంటున్నాడు:
మేం కలిసిపోటీ చేస్తాం అనగానే.. జనసేన వాళ్లు చప్పట్లు కొడుతున్నారు. బాలకృష్ణ కూడా లైట్‌గా కొట్టాడు. తమ్ముడు మాత్రం కొట్టడం లేదు. వీడితో మనకి పొత్తేంటి?. మా నాన్నకు మైండ్ చెడిపోయిందా అని బాధ పడుతున్నాడు. విషణ్ణవదనంతో, బాధతప్త హృదయంతో ఆయన బాధ పడిపోతున్నాడు.
అనేక మంది యువతీ యువకులు నిజాయితీగా నీ జెండా మోస్తుంటే ఇలాంటి పాప కార్యక్రమాలు చేయడం ధర్మమా అనేది నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ మాటలకు, ఈ రోజు నువ్వు చేస్తున్న తంతుకు ఏ మాత్రం పొంతన ఉందా..? కనీసం జెండా మోసే ముక్కుపచ్చలారని పిల్లల భవిష్యత్తు కోసమైనా నిజాయితీగా ఉండమని కోరుకుంటున్నా.
మా అమ్మగారిని, కుటుంబ సభ్యులను తిట్టారు..అవమానించారు. వారిని పతనం చేస్తాను అని పతిన బూనారు. జైళ్లోకి వెళ్లి ఏం మాట్లాడుకున్నారో క్షమించారు..మరి జెండా మోసే వాళ్ల పరిస్థితి ఏంటి..?
బాలకృష్ణ ఏం మాట్లాడారో గుర్తుకు లేదా..? మీ వెంట తిరిగే జెండా మోసే కార్యకర్తలను అలగా జనం అని మాట్లాడిన వ్యక్తిని పక్కన పెట్టి పొత్తులు అంటున్నావు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి..? ఇదంతా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
ఎందరొచ్చినా ఏమీ చేయలేరు:
ఇంకా ఎన్ని పార్టీలను కలుపుకుని వచ్చినా మరొక 20 ఏళ్లు జగన్మోహన్‌రెడ్డి గారిని ఏమీ చేయలేరు. జైలు బయట మీరు కూడా అదే మాట చెప్పారు. 2024లో జగన్ గారికి జనం గుండెల్లో ఉన్న స్థానం సుస్థిరమైనది. అభేద్యమైనది. మీరెన్ని గుంపులు కట్టి వచ్చినా ఏమీ చేయలేరు.
బావ జైల్లోకి వెళ్లగానే..బావ కుర్చీలో కాసేపు కూర్చుంటే సరిపోతుందా..? బాలకృష్ణ తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటే సిగ్గున్న వాడైతే జనసేనతో వెళ్లకూడదు కదా..? పురందేశ్వరి అవినీతి కేసులో కేంద్ర ప్రభుత్వ సంస్థల కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు అరెస్టును పురందేశ్వరి ఖండించారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జాతీయ పార్టీ వారి ఖర్మ అది. రాష్ట్రంలో బారతీయ జనతా పార్టీని బావ జనతా పార్టీగా చేసేసింది. బీజేపీ వారు బాధపడాలి తప్ప మనమేం చేయలేం.
పార్టీ పెట్టిన 7 ఏళ్లకే 175కి 151 సీట్లతో 51 శాతం ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ. బూత్, గ్రామ, మండల కమిటీల వ్యవస్థే లేనటువంటి వ్యక్తి ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు.
ఒక రాజకీయ పార్టీని మీ సిద్ధాంతం ఏంటి అని నిలదీసే హక్కు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉంటుంది. నిజాయితీగా నీ సిద్ధాంతం ఏంటో చెప్పమంటున్నాం. నేను 175కి పోటీ చేసే సినిమా లేదు..చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాను అని చెప్పు..తప్పేముంది..?
ముసుగేసుకుని దొంగమాటలు మాట్లాడుతున్నావు కాబట్టే ప్రశ్నిస్తాం. ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ఉంది.
దోచుకున్నోడ్ని పట్టుకుని అరెస్ట్ చేస్తే శభాష్ అనాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావు..
నిన్నటి వరకూ చంద్రబాబు దోచుకున్నాడు అన్నావ్…నేడు దిగజారుడు రాజకీయం పవన్ కల్యాణ్‌ది కాదా..? రూ.300 కోట్లు చిన్న ఎమౌంట్‌గా కనిపించిందా..? ఇది చిన్న టోకెన్ ఎమౌంట్ మాత్రమే. జగన్ గారు తీగ లాగుతున్నారు.. ఇంత సంపాదించి నాకు బాండ్ వేశాడేంటి అని నువ్వు బాధపడే విధంగా కచ్చితంగా నీకు జగన్ గారు చూపిస్తారని శ్రీ పేర్ని నాని, పవన్‌కళ్యాణ్‌కు చురకలంటించారు.