స్థానిక మాదిగ ఉద్యమకారులు, కళాకారులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్.
లేనిపక్షంలో అన్ని ప్రజాసంఘాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
రాష్ట్రంలో 3 పార్లమెంట్ స్థానంలో 2 స్థానాలు మాదిగలకే కేటాయించాలి..
— మీసాల రామన్న మాదిగ డిమాండ్
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికే, ఎంపీ టికెట్ కేటాయించాలని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీసాల రామన్న మాదిగ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే, జనాభా దామాషా ప్రకారం ప్రధాన పార్టీల నాయకులు రెండు పార్లమెంటు స్థానాలను మాదిగలకే కేటాయించాలని, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం స్థానిక మాదిగ ఉద్యమ నాయకులకు, స్థానిక కళాకారులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వని వివిధ పార్టీల వారిని ఓడిస్తామని హెచ్చరించారు. స్థానిక నాయకులకు కాకుండా నాన్ లోకల్ వారికి ఎంపీ టికెట్ ఇస్తే కచ్చితంగా వారిని ఓడ గొట్టి, తగిన బుద్ధి చెప్తామని, వివిధ రాజకీయ అగ్ర నేతలను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్మూరి రాములు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, గుట్టలపల్లి నాగరాజ్, రామస్వామి, కానాపురం రాములు తదితరులు పాల్గొన్నారు