పీఎం సేతుతో ఐటీఐల ఆధునీకరణకు పెద్దపీట…
యువతకు ఆధునిక నైపుణ్యాలు, సుస్థిర ఉపాధి లక్ష్యం… –కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పీఎం సేతు (పీఎం సేతు ) పథకాన్ని పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి యువతకు ఆధునిక నైపుణ్యాలతో కూడిన సుస్థిర ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో పీఎం సేతు పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరించేందుకు పీఎం సేతు పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం కింద 50 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 17 శాతం పరిశ్రమలు భరిస్తూ ఐటీఐ క్లస్టర్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఐదు సంవత్సరాల్లో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా పరిశ్రమల భాగస్వామ్యంతో సుమారు రూ.40 కోట్లు సమకూరనున్నాయని తెలిపారు.
తెలంగాణలో హైదరాబాద్, ఓల్డ్ సిటీ, పటాన్చెరు, మేడ్చల్, సంగారెడ్డి, పెద్దపల్లి ప్రాంతాలను పీఎం సేతు క్లస్టర్లుగా గుర్తించారని, పరిశ్రమల అనుసంధానంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఈ పథకం అమలుకు సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్, ఎన్ టి పి సి లిమిటెడ్ సంస్థలతో భాగస్వామ్యంపై చర్చలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఆయా సంస్థల అధికారులు హెడ్ ఆఫీసులతో చర్చించి అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు పొందాలని సూచించారు.
ప్రత్యేక ప్రయోజన వాహకం (ఎస్ పి వి) ద్వారా ఈ ప్రాజెక్టు నిధుల వినియోగం జరుగుతుందని, ప్రతి సంవత్సరం సుమారు రూ.5 కోట్ల చొప్పున సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు సి ఎస్ ఆర్, కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల కింద వ్యయం చేసే అవకాశముందని వెల్లడించారు.
పెద్ద పరిశ్రమల సహకారంతో స్థానిక యువతకు ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించి సుస్థిర ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్న కలెక్టర్, ఐటీఐల ఆధునీకరణ అత్యవసరమని అన్నారు.
ఈ సమావేశంలో సీపీఓ రవీందర్, సింగరేణి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఎన్టీపీసీ సంస్థల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
