శాసనసభలో లస్కర్లు, ఇళ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గంలోని రైతులు, సాగునీటి వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న లస్కర్లు, అలాగే నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ గృహాల సమస్యలను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాల శాసనసభ సమావేశాల్లో సభలో మాట్లాడిన ఎమ్మెల్యే , ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో డెల్టా ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో లస్కర్లకు ఎదురవుతున్న జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో గత ప్రభుత్వం నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన సుమారు 400 ఇళ్లను అవసరమైన చర్యలు తీసుకుని పేద, నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో లస్కర్ల పాత్ర కీలకం
కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతమని, నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లస్కర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. లస్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో కూడా శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రస్తుతం వారికి జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ అంశాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పన్నులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం వాటిని వసూలు చేయడం ద్వారా అయినా లస్కర్ల జీతాల సమస్యను పరిష్కరించే మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
