SAKSHITHA NEWS

Lieutenant General Upendra Dwivedi is the new Chief of the Indian Army

న్యూ ఢిల్లీ :

భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌ సి.పాండే ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌గా ఉన్నారు. 

1964లో జన్మించిన ఉపేంద్ర ద్వివేది.1984లో జమ్ముకశ్మీర్‌ రైఫిల్స్‌లో చేరారు. ఇప్పటి వరకు 40 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఆయన ఆర్మీలో పలు కీలక పాత్రలు పోషించారు. కశ్మీర్‌ వ్యాలీ, రాజస్థాన్‌ సెక్టార్‌లో పనిచేశారు. సెక్టార్‌ కమాండర్‌, అస్సాం రైఫిల్స్‌ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపేంద్ర ద్వివేది గతంలో డైరెక్టర్‌ జనరల్‌ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించారు.

రేవా సైనిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించిన ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ, యూఎస్‌ ఆర్మీ వార్‌ కళాశాలలో చదువుకున్నారు. డిఫెన్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు. స్ట్రాటజిక్‌ స్టడీస్‌, మిలిటరీ స్టడీస్‌లో రెండు మాస్టర్‌ డిగ్రీ పట్టాలను అందుకున్నారు. ఇక కేంద్ర బలగాల్లో తన సేవలకు గానూ పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను కూడా అందుకున్నారు. 

WhatsApp Image 2024 06 12 at 11.47.22

SAKSHITHA NEWS