SAKSHITHA NEWS

పర్యావరణ పరిరక్షణకు, మానవుని మనుగడకు చెట్లను సంరక్షించుకుందాం
-రాష్ట్రంలో పెద్ద ఎత్తున వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం
-సెప్టెంబరు 2 న నదుల పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి
-ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
-మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, సాక్షిత :
పర్యావరణ పరిరక్షణకు , మానవుని మనుగడకు ప్రాణవాయువునందించే చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర రావు, అటవీ శాఖ అధికారి బి.నాగరాజు, ప్రజా ప్రతినిధులు బత్తుల వెంకటలక్ష్మి, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తొలుత వనమహోత్సవ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టరు , ఎమ్మేల్యే లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ‘వృక్షో రక్షిత రక్షితః” అనే సంకల్ప దీక్షతో చెట్లను సంరక్షించడం వలన అవి మానవ మనుగడకు ప్రధానమైన ఆక్సిజన్ అందిస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం మన రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో వేదికగా జరుపుకుంటున్నా మన్నారు. పాఠశాలలో ఏకో క్లబ్స్ ను ప్రారంభించి మొక్కలు నాటడం, వాటి పరిరక్షణా బాధ్యతలను చేపట్టే విధంగా విద్యార్థుల కొరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
మొక్కలు పెంచక పోవడం, వాటిని నరకడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం చూస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను సంరక్షిద్దామన్నారు.

సెప్టెంబరు 2 వ తేదిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నదుల్లో చెత్త చెదారాన్ని తొలగించడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. నేడు మొక్కలు నాటి సంరక్షించడం వలన రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు ఆక్సిజన్ తో పాటు వాటి యొక్క ఫలాలను కూడా అందించి పర్యావరణ పరిరక్షణ కు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులందరూ ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమంలో, సంరక్షణ బాధ్యతలు చేపట్టి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పాటుతో ద్వారా కార్బన్డయాక్సైడ్ వంటి వాయువును నియంత్రించి ఆక్సిజన్ అందించడంలో చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తాయన్నారు. సమాజ హితం కోరే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మాతృభాషను కాపాడుకొని వ్యక్తిత్వ వికాసానికి దోహదపడదామన్నారు. ఇటీవలి కుమార దేవం గ్రామములో సినిమా చెట్టు కూలిపోవడంతో వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్న జిల్లా కలెక్టర్ అభినందనీయులని పేర్కొన్నారు. సామాజిక అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నా మన్నారు. జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని 60 రోజులు పాటు నిర్వహించుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. ఈ రోజుల్లో వీలున్న అన్ని ప్రదేశాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. నాటిన ప్రతీ మొక్కల్ని బ్రతికించడానికి అవసరమైన ట్రీ గార్డ్, నీటి సౌకర్యం వంటి జాగ్రత్తలను తీసుకోవడం జరుగు తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ, పరిశ్రమల్లోనూ, రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటి వాటి సంరక్షించే కార్యక్రమాలను చేపడతామన్నారు. చెట్లు ద్వారానే ఆక్సిజన్ లభ్యమవుతుందని , కోవిడ్ వంటి సమయంలో ఆక్సిజన్ అందుబాటు లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చిందో మనందరికీ తెలుసు అన్నారు. స్వచ్ఛ ఆక్సిజన్ కోసం ఢిల్లీలో ఆక్సిజన్ చాంబర్స్ వచ్చాయన్నారు. పొల్యూషన్ లేని ఆక్సిజన్ ను ఆస్వాదించే దిశగా మొక్కలు నాటడం ద్వారా సాకారం చేసుకోవాలన్నారు. గతంలో ఒక్క కొత్తగూడెంలో మాత్రమే 45 డిగ్రీల టెంపరేచర్ నమోదు చూసేవారమని, నేడు ఆ టెంపరేచర్ రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నామన్నారు. దీనికి కారణం చెట్లు లేకపోవడమే అని మనం గుర్తించాలన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం మన్నారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, వనం మనం ను మాటలు కాదు చేతల్లో చూపించాల్సి అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. నేడు మొక్కలు నరికివెయ్యడం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంకు ప్రధాన కారణం అన్నారు. మన బాధ్యత గా ఇంటికో మొక్క నాటడం లో అందరం సమిష్టిగా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు.
రాజమండ్రి సీటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం కాదు వాటిని పరిరక్షించడం ముఖ్యం అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రతీ ఒక్కరూ మొక్కని నాటి అభిమానాన్ని చాటుకోవాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ అధికారి బి. నాగరాజు, ఊరంతా వనం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడూ వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 15 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. 230 ఎకరాల్లో నగర వనం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటవీ శాఖ జిల్లా అధికారి బి నాగరాజు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ దాస్. కె. రామచంద్రరావు , ప్రజా ప్రతినిధులు బత్తుల వెంకట లక్ష్మీ, ఆర్డీఓ కే ఎల్ శివ జ్యోతి, ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి రెండేసి మొక్కల ను అందచేసి వాటి పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS