నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు
-రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సుబ్బారెడ్డి
రాజమహేంద్రవరం, సాక్షిత :
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారపధార్ధములు అందించాలని, నిబంధనలు పాటించని రెస్టారెంట్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి నెత్రుత్వంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని కె.ఎఫ్.సి ( దావ్యని ఇంటర్నేషనల్ ఎల్.టీ.డి), సత్య పంచకళ్యాణి పలావ్ హోటల్( పందలపాక అప్పారావు బిర్యానీ హోటల్ )ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖిలు నిర్వహించారు. ఈ దాడుల్లో కె.ఎఫ్.సి హోటల్లో తయారు చేసి తినడానికి సిద్ధంగా ఉన్న హాట్ మరియు క్రిసపీ చికెన్ నుండి ఒక శాంపిల్ ను, ఫ్రై చేయుటకు ఉపయోగిస్తున్న ఆయిల్ నిల్వల నుండి ఒక శాంపిల్ ను నాణ్యత పరీక్ష నిమిత్తం హైదరాబాద్, నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపూటకు శాంపిల్ పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సదరు హోటల్ నందు ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టి. పీ. సి) మీటర్ రీడింగ్ 25% లోపు వుండాల్సి వుండగా దానికన్న (అనగా 133°సి వద్ద 38.5%, 151°సీ వద్ద 39.5% 157°సి వద్ద 39.5% ) ఎక్కువగా వున్నందున ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ కలెక్టర్ కోర్టు నందు కేసు నమోదు చేశారు.
సత్య పంచకళ్యాణి పలావ్ హోటల్……
సత్య పంచకళ్యాణి పలావ్ హోటల్ (పందలపాక అప్పారావు బిర్యాని) నందు ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్ నందు తయారు చేసి తినడానికి సిద్ధంగా ఉన్నా చికెన్ ఫ్రై నమూనాలను నాణ్యత పరీక్ష నిమిత్తం హైదరాబాద్, నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపూటకు శాంపిల్ తీసినట్లు తెలిపారు. సదరు హోటల్ నందు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించని కారణంగా హోటల్ యాజమాన్యం వారికి ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేసినారు. సత్య పంచకళ్యాణి పలావ్ హోటల్ నందు స్టాంప్ లేని తూకం యంత్రం కలిగియుండుట చేత లీగల్ మెట్రాలజి అధికారులు సదరు వేయింగ్ మిషన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మరియు గృహ అవసరాల నిమిత్తం ఉపయోగించాల్సిన 3హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గా గుర్తించి మండల సివిల్ సప్లైస్ ఆఫీసర్ మూడు హెచ్.పి. కంపెని కి చెందిన సిలెండర్ లను సీజ్ చేసి 6(ఎ) కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఉమ్మడి జిల్లాలోని హోటల్ /రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టి. పి సి) మీటర్ రీడింగ్ 25% లోపు వుండవలసి వుండగా దానికన్న ఎక్కువగా వుంటున్నాయని, దాని వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ వచ్చు అవకాశాలు ఎక్కువ గా వుంటాయన్నారు. కావున టోటల్ పోలార్ కాంపౌండ్స్ మీటర్ రీడింగ్ 25% లోపున వుండేలా రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. రెస్టారెంట్లు, బార్ల పరిసరాలు, కిచెన్లు పరిశుభ్రముగా వుంచాలని, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారపధార్ధములు అందించాలని సూచించారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. .
ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు ఎస్ఐ జగనాథరెడ్డి, డి.సి.టి.ఓ. నవీన్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రుక్కయ్య, లీగల్ మెట్రాలజి అధికారి బాలాజీ, పి.సి. ఎస్.వలి, కిషోర్, శివ, లోవరాజు, వీరబాబు పాల్గొన్నారు.