హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న నూతన సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. నిర్మాణ కౌశలంలోనూ ముందు నిలిచి సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోతగా తెలంగాణ ఠీవికి దర్పణంలా రూపుదిద్దుకుంది. చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో ఇది మరో మకుటం కానుంది. ఒక కోణంలో వనపర్తి సంస్థాన రాజప్రాసాదం.. మరో కోణంలో నిజామాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వరాలయం.. గుజరాత్‌లోని సలంగ్‌పూర్ హనుమాన్ ఆలయాల శైలిలో ఏర్పాటు చేసిన గుమ్మటాలు.. తీరొక్క సంస్కృతులను సృజిస్తూ రూపొందిన కట్టడమిది. హిందూ.. దక్కనీ.. కాకతీయ నిర్మాణ రీతులు.. సువిశాలమైన ప్రాంగణంలో ఆకాశహర్మ్యాలు.. రెండు గుమ్మటాలపై జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకంలా తళుకులీనుతోందీ నూతన భవనం. సుమారు రూ. 617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాసాదం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రజలకు సేవలందించనుంది. ఈ నెల 30వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు ఇక్కడి నుంచే మొదలు కానున్నట్లు సమాచారం.
ఇదే భారీ సచివాలయం
దేశంలో ఇటీవల కాలంలో నిర్మించిన సచివాలయ భవనాల్లో తెలంగాణ నిర్మించిన నూతన ప్రాంగణమే అగ్రగామిగా నిలవనుంది. గడచిన పదేళ్లలో రెండు రాష్ట్రాలు నూతన సచివాలయాలను నిర్మించాయి. 2012లో మహానది భవన్ పేరిట ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 6.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మించగా.. వల్లభ్ భవన్ పేరుతో 2018లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 9 లక్షల చదరపుటడుగుల్లో భవనాన్ని నిర్మించింది. 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ నిర్మాణంగా తెలంగాణ సచివాలయం రికార్డులకు ఎక్కనుంది.
ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం
భవనం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం కొలువు తీరింది. దీంతోపాటు నాలుగు సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి మంత్రికి కేటాయించిన అంతస్తులో ఒక్కో మినీ కాన్ఫరెన్స్ హాలు సిద్ధమైంది. ఏకకాలంలో 30 మందితో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లున్నాయి. ఆయా మంత్రుల కార్యాలయాలతో పాటు ఆ శాఖ ప్రధాన అధికారుల కార్యాలయాలు కూడా ఒకే అంతస్తులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో రెండు ద్వారాలే (గేట్లు) ఉండేవి. కాలక్రమంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు గేటును మూసివేసి, తూర్పువైపు గేటునే వినియోగించారు. ఇప్పుడు నూతన సచివాలయానికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు.
24 గంటల్లో పాత సచివాలయం కూల్చివేత
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన మునుపటి సచివాలయంలో అక్కడొక్కటి అక్కడొకటిగా ఆకాశహర్మ్యాలుండేవి. ఆ ప్రాంగణంలో పెద్దా, చిన్నా కలిపి 22 వరకు ఉన్న నిర్మాణాల్లో కొన్ని శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని ఒకటి రెండు దశాబ్దాల లోపు నిర్మించినవీ ఉన్నాయి. అన్నీ కలిపి సుమారు 9 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండగా.. వాటన్నింటినీ 24 గంటల వ్యవధిలో సంప్రదాయ విధానంలో కూల్చివేశారు. 1.40 లక్షల టన్నుల (14 వేల ట్రిప్పుల) నిర్మాణ వ్యర్థాలను తొలగించారు.
26 నెలల్లో పూర్తి
కొత్త సచివాలయ నిర్మాణం కోసం గుత్తేదారులు, అధికారులు 26 నెలలు శ్రమించారు. అందులో నాలుగు నెలలు కరోనాతో ఎలాంటి పనులు నిర్వహించలేని పరిస్థితి. ఆ సమయాన్ని అధికారులు నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకు వినియోగించుకున్నారు. సచివాలయ నిర్మాణానికి 2019 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. పాత భవనం కూల్చివేత పనులు 2020 జులైలో చేపట్టారు. 2021 జనవరిలో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించారు.ఆమోదిత డ్రాయింగ్స్ రాకపోయినప్పటికీ చిత్తు కాగితాలపై డ్రాయింగ్స్‌ను సిద్ధం చేసి ఆ మేరకు పనులు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆధునిక వసతులతో సౌకర్యవంతంగా నిర్మితమైన ఈ భవనం రాష్ట్ర పరిపాలన విధులకు సర్వసన్నద్ధమైంది.
నిర్మాణానికి పట్టిన సమయం: 26 నెలలు
ప్రాంగణ విస్తీర్ణం: 28 ఎకరాలు