SAKSHITHA NEWS

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత

దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్‌ చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

‘‘భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారు. అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుంది. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా అది ఇంకా చట్టం కాలేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. మహిళా రిజర్వేషన్‌ సాధించేవరకు విశ్రమించేది లేదు’’ అని కవిత అన్నారు.


SAKSHITHA NEWS