SAKSHITHA NEWS

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి

సాక్షిత బ్యూరో ఖమ్మం బ్యూరో చీఫ్:

జూనియర్ పంచాయతీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నిరసనకు దిగారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు గడిచినా జూనియర్ పంచాయతీ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న తమకు గత రెండు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యూలర్ చేస్తూ జీవోను విడుదల చేయాలని, గడిచిన నాలుగు సంవత్సరాలు ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్యదర్శులు అందరినీ జేపీఎస్లుగా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్ లో భాగంగా పరిగణించి వారిని కూడా రెగ్యులర్ చేయాలని, అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని పరస్పర బదిలీలు, స్వాస్ బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూనియర్ పంచాయతీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరోసారి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సమ్మె బాటకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ కి వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జేపీఎస్, ఓపీఎస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS