SAKSHITHA NEWS

సాధారణ లోకసభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి బి. యం. సంతోష్ కోరారు.

 కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో  నాగర్ కర్నూల్  సాధారణ లోకసభ ఎన్నికల నిర్వహణపై పాత్రికేయులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,  భారత ఎన్నికల కమిషన్ లోకసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి గజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26  న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఓటరు జాబితా ప్రకారం 243353 మంది పురుషులు, 251573 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు మొత్తం 494945 మంది ఓటర్లు ఓటరు జాబితాలో  ఉన్నారని తెలిపారు. 97 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, 85 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మాత్రమే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలియజేశారు.  జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గద్వాల నియోజకవర్గంలో 303, అలంపూర్ నియోజకవర్గంలో  290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గద్వాలలో  161, అలంపూర్ లో 146 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.  ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు మద్యం రవాణా చేయకుండా అరికట్టడం జరుగుతుందన్నారు.  సరిహద్దు ప్రాంతాలలో అక్రమాలు జరగకుండా నివారించేందుకు గద్వాలలో మూడు చెక్ పోస్టులు, అలంపూర్ లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై సి - విజిల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని, వచ్చిన ఫిర్యాదులను వంద నిమిషాలలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ఇప్పటి వరకు ఐదు ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు.  అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.  ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, వివి ప్యాడ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  ఎన్నికలలో భాగంగా ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పొలిటికల్ పార్టీలు సువిధ ఆప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రెండు రోజులలో అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఈవీఎం లు, ఎన్నికల సిబ్బందికి రాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరుగుతుందన్నారు.  గత శాసనసభ ఎన్నికలను నిర్వహించిన అనుభవంతో, పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంతంగా,  పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఎన్నికలలో భాగంగా నామినేషన్లు కౌంటింగ్ ప్రక్రియ నాగర్ కర్నూల్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  జిల్లాలో ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యే విధంగా మీడియా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఫామ్ - 6 ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.  స్వీప్ ప్రచార కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఓటరు నమోదు పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.   జిల్లాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి దాదాపుగా తొలగించడం జరిగిందని తెలియజేశారు. ఓటు హక్కు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని  సూచించారు. ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాలన్నారు. 

సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

WhatsApp Image 2024 03 20 at 6.02.31 PM

SAKSHITHA NEWS