ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో జమాఅతె ఇస్లామీహింద్ ఇజ్తెమా!
- అబ్దుల్ జబ్బార్ సిద్దీఖీ
….
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
వాదియే హుదా అంటే చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు.. ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్.. చార్మినార్ కు సుమారు 10కి.మీ. దూరంలో ఉన్న వాదియే హుదా ప్రాంతం
జమాఅతె ఇస్లామీహింద్ అఖిల భారత సభ్యుల ఇజ్తెమాకోసం సిద్ధమవుతోంది. జమాఅతె ఇస్లామీహింద్ కార్యకర్తలు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.
దేశ నలుమూలల నుంచి తరలిరానున్న వేలాది మంది జమాఅతె ఇస్లామీహింద్ సభ్యులకు మూడు రోజుల పాటు మంచి ఆతిథ్యమిచ్చేందుకు సమావేశ ప్రాంగణాన్ని అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 15 నుండి 17 వరకు హైదరాబాద్‌లోని హుదా జరగున్న ఈ మహా ఇజ్తెమాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 1981లో జరిగిన చారిత్రాత్మక అఖిల భారత ఇజ్తెమా కారణంగా వాదియే హుదా మైదానం దేశవ్యాప్త ఖ్యాతిని పొందింది. ‘న్యాయానికి ధ్వజవాకులుగా నిలవండి’ అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగే ఈ ఇజ్తెమాలో పాల్గొనేందుకు తొలిసారిగా తొమ్మిది వేల మంది కొత్త సభ్యులు తరలివస్తున్నారని, ఇజ్తెమా లక్ష్యాలు, సన్నాహాల గురించి, నాజిమే ఇజ్తెమా జమాతే ఇస్లామీ హింద్ సెంట్రల్ మజ్లిస్ షూరా సభ్యుడు జనాబ్ అబ్దుల్ జబ్బార్ సిద్దిఖీ వివరించారు. ‘‘ఏ ఉద్యమ విజయానికైనా కార్యకర్తల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలి. ఐక్యత బలంగా ఉండాలి. అప్పుడే ఉద్యమ లక్ష్యాలు నెరవేరడానికి ప్రేరణ లభిస్తుంది.’’ అని ఇజ్తెమా ఉద్దేశాలను జబ్బార్ సిద్దీఖీ వివరించారు. ఆయన ఇజ్తెమా సన్నాహాల గురించి చెప్పిన వివషయాలు ఆయన మాటల్లోనే..
అల్హమ్దులిల్లాహ్ ఇజ్తెమా ను జయప్రదం చేసేందుకు యాభై శాఖలు ఏర్పాటు చేసి శక్తివంచన లేకుండా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. మీటింగ్ హాల్‌ను అన్ని సౌకర్యాలతో నిర్మించాము. జర్మన్ టెంట్‌తో కూడిన విశాలమైన ఆడిటోరియం సిద్ధం చేశాము. జమాఅతె ఇస్లామీహింద్ ఉద్యమ కార్యకలాపాలను కళ్లకు కట్టేలా వివరించే ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నమాజుల కోసం ప్రత్యేక హాలు, బస చేసేందుకు నివాసాలు, క్యాంటీన్ల పనులు జరుగుతున్నాయి. అత్యున్నత ప్రమాణాల ఏర్పాట్ల కోసం నీటి సరఫరా, విద్యుత్, పురపాలక శాఖ తదితర వివిధ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకుంటున్నాము. ఇజ్తెమా భద్రతను రాచకొండ డీసీపీ పర్యవేక్షిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఇజ్తెమా ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా అత్యంత తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సౌకర్యాలను అందించడమే మా ప్రయత్నం.
సభాస్థలం ఏర్పాటు, అలంకరణలో నవీనత, సౌందర్య అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాము. సమావేశ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించేందుకు సభా స్థలం చుట్టూ ఉన్న బండ రాళ్లపై ఖురాన్ వాక్యాలతో తీర్చిదిద్దుతున్నాము. వాదియే హుదా ప్రకృతిని సద్వినియోగం చేసుకుంటూ ఎత్తైన ప్రదేశంలో కృత్రిమ జలపాతం నిర్మించాము. ఇది రాత్రిపూట ప్రత్యేకంగా చూడదగినదిగా ఉంటుంది.
సభా ప్రాంగణానికి వెళ్లే 5 రహదారుల గేట్లకు ఐదుగురు జమాఅత్ నాయకుల పేర్లను పెట్టాము. జమాతే ఇస్లామీ హింద్ మాజీ నాయకులు మౌలానా అబుల్ లైస్ నద్వీ, మౌలానా ముహమ్మద్ యూసుఫ్, మౌలానా సిరాజ్- ఉల్-హసన్, మౌలానా అబ్దుల్ హక్ అన్సారీ మరియు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఒమరీ. ఈ ఇజ్తెమా ప్రధాన ధ్యేయం ఉపదేశాలు, ప్రసంగాలు చేయడం, వినడానికే పరిమితం కాదు. జమాఅతె సభ్యుల మధ్య పరస్పర పరిచయం, పరస్పర అనుభవాలను పంచుకోవడానికి ఈ ఇజ్తెమా వీలు కల్పిస్తుంది. సామూహికతను పటిష్టపరచడమూ ఈ ఇజ్తెమా లక్ష్యాలలో ఒకటిగా మేం భావిస్తున్నాము.
- ముహమ్మద్ ముజాహిద్