విశాఖ శారదాపీఠంలో సేవా కార్యక్రమాలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సన్యాసం స్వీకరించి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా చినముషిడివాడలోని పీఠ ప్రాంగణంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సంప్రదాయ వస్త్రాలను అందించారు.
స్మార్త, వేద పండితులను దక్షిణలతో సత్కరించారు. పీఠం సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేసారు. పేదలకు, భక్తులకు అన్నదానం చేసారు. వేద విద్యను అభ్యసించేందుకు 6వ ఏటనే విశాఖ శ్రీ శారదాపీఠంలో చేరారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాలలో వేదాలను ఔపోసన పట్టారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ప్రధాన శిష్యునిగా మెలుగుతూ బాలస్వామిగా గుర్తింపు పొందారు. 2019 సంవత్సరంలో జ్యేష్ట పౌర్ణమి రోజున సన్యాసం స్వీకరించారు. అదేరోజు స్వాత్మానందేంద్ర స్వామిగా నామకరణం చేసి పట్టాను అందజేయడంతో పాటు ఉత్తరాధికారి బాధ్యతలను అప్పగించారు.