SAKSHITHA NEWS

ఫోన్‌ పోయిందా… ఇట్టే కనిపెట్టేయొచ్చు..!

దిల్లీ: ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఫోన్‌ (Mobile Phone) పోతే ఎంతో బాధగా ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న డేటా గురించి తీవ్ర ఆందోళన చెందుతాం.

కాంటాక్టులు, మెసేజ్‌లు, ఫొటోలు/వీడియోలు, బ్యాంకింగ్‌ వివరాలు, పేమెంట్‌ యాప్‌లు, సోషల్‌ మీడియా.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా ఉంటుంది. దీంతో మనలో చాలా మంది ఫోన్‌ పోయిందంటే సర్వమూ పోయినట్టే భాస్తుంటారు. గతంలో ఫోన్ పోతే తిరిగి దొరికిన సందర్భాలు చాలా అరుదు.

ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర టెలికాం విభాగం (DOT), సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పేరుతో ఆధునిక సేవలను మొబైల్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో పొగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. 2019లోనే ఈ సేవలను ప్రయోగత్మకంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ప్రారంభించారు. ప్రస్తుతం మార్చి 15 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరి, సీఈఐఆర్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

ఫోన్‌ ఐఎమ్‌ఈఐ (IMEI) ఆధారంగా సీఈఐఆర్‌ పనిచేస్తుంది. ఇందుకోసం దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లు, మొబైల్‌ తయారీ సంస్థలు కలిసి డీవోటీ యూజర్లకు సేవలను అందిస్తున్నాయి.
సీఈఐఆర్‌ వెబ్‌, మొబైల్‌ యాప్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది. యూజర్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ను ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ యాప్‌ వెర్షన్‌ నో యువర్‌ మొబైల్‌ (KYM) పేరుతో అందుబాటులో ఉంది.
ఫోన్‌ పోయిన తర్వాత యూజర్‌ దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందిన తర్వాత సీఈఐఆర్‌ పోర్టల్‌ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌ (Block Stolen/Lost Mobile), అన్‌-బ్లాక్‌ ఫౌండ్‌ మొబైల్‌ (Un-Block Found Mobile), చెక్‌ రిక్వెస్ట్ స్టేటస్‌ (Check Request Status) అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
వాటిలో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌ (Device Information)లో ఫోన్‌ నంబర్‌, ఐఎమ్‌ఈఐ నంబర్‌, ఫోన్ బ్రాండ్‌ పేరు, మోడల్‌ వివరాలు నమోదు చేసి, మొబైల్‌ కొనుగోలుకు సంబంధించిన రశీదు ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
తర్వాత లాస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ (Lost Information) సెక్షన్‌లో ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం, తేదీ, పోలీస్‌ కంప్లయింట్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి.
ఈ ప్రక్రియ తర్వాత కింద మొబైల్ యూజర్‌ వ్యక్తిగత వివరాలు ((Mobile User Personal Infromation)).. అంటే పేరు, చిరునామా, గుర్తింపు కార్డ్‌, ఈ-మెయిల్‌ వంటి వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి. తర్వాత యూజర్‌ ఫిర్యాదును స్వీకరిస్తున్నట్లు రిక్వెస్ట్ ఐడీ (Request ID) నంబర్‌ చూపిస్తుంది. దీన్ని భవిష్యత్తులో కంప్లెయింట్ స్టేటస్‌ తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చు.
యూజర్‌ సమర్పించి వివరాల ఆధారంగా సదరు మొబైల్‌ను 24 గంటల వ్యవధిలో సీఈఐఆర్‌ బ్లాక్ చేస్తుంది. ఆ వివరాలను మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లకు పంపుతుంది.
అలా బ్లాక్‌ చేసిన మొబైల్‌లో ఇతరులు ఎవరైనా సిమ్‌ కార్డ్‌ వేస్తే, వెంటనే సీఈఐఆర్‌కు అలర్ట్ మెసేజ్‌ వస్తుంది. దాంతో యూజర్‌ పోగొట్టుకున్న ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందనేది సులువుగా గుర్తించవచ్చు.
ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్‌ తిరిగి దొరికితే యూజర్‌ సీఈఐఆర్‌ పోర్టల్‌లో అన్‌-బ్లాక్‌ ఫౌండ్‌ మొబైల్‌పై క్లిక్ చేసి రిక్వెస్ట్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వివరాలు సమర్పిస్తే.. ఫోన్ అన్‌-బ్లాక్‌ అవుతుంది.
అలానే కొత్త ఫోన్‌ లేదా సెకండ్‌ హ్యాండ్ ఫోన్‌ కొనాలనుకునే వారు తాము ఎంచుకున్న ఫోన్ మోడల్‌ ఐఎమ్‌ఈఐ నంబర్‌ను వెబ్‌ పోర్టల్‌ కేవైఎమ్‌ సెక్షన్‌లో లేదా మొబైల్‌ యాప్‌లో నమోదు చేయడం ద్వారా గానీ, KYM <15 అంకెల ఐఎమ్‌ఈఐ నంబర్‌> టైప్‌ చేసి14422కు ఎస్సెమ్మెస్ పంపి ఫోన్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు


SAKSHITHA NEWS