పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది?
ఏ చర్యను నేరంగా పరిగణిస్తారు? దేనికి ఎంత శిక్ష విధిస్తారు?
నేటి వరకూ ఈ అంశాలను నిర్ణయించేది 160 ఏళ్లనాటి ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షా స్మృతి -ఐపీసీ). దీనిలో 500కి పైగా సెక్షన్లు ఉన్నాయి. వీటిలో భిన్న రకాల నేరాలను నిర్వచించారు. వాటికి తగిన శిక్షలను కూడా పేర్కొన్నారు.
ఐపీసీలో కాలానికి అనుగుణంగా చాలా మార్పులు, చేర్పులు చేశారు. అయితే, దీని రూపం మాత్రం మారలేదు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనిలో భారీగా మార్పులను తీసుకొస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ల స్థానాలను భర్తీచేసే మూడు కొత్త బిల్లుల ముసాయిదాలను లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
ఆ ముసాయిదాలకు భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య్ బిల్-2023గా పేర్లు పెట్టారు.
ఈ బిల్లులు పార్లమెంటరీ ప్రక్రియల అనంతరం త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశముంది.
వీటిని ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షా మాట్లాడుతూ- ‘‘1860 నుంచి 2023 వరకూ మన దేశంలోని న్యాయ వ్యవస్థ బ్రిటిష్ కాలంనాటి చట్టాలనే అనుసరిస్తూ వచ్చింది. వాటి స్థానంలో భారతీయతను ప్రతిబింబించే ఈ మూడు బిల్లులను తీసుకొస్తున్నాం. వీటితో మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చాలా మారుతుంది’’ అన్నారు.
మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయ సంహితలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అమిత్ షా నొక్కిచెప్పారు.
ఐపీసీతో పోలిస్తే న్యాయ సంహితలో నిబంధనలు ఎలా భిన్నంగా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.
పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే శిక్ష ఏమిటి?
భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులోని సెక్షన్ 69 ప్రకారం, పెళ్లి చేసుకుంటానని లేదా ఉద్యోగం ఇస్తానని, లేదా ప్రమోషన్ ఇప్పిస్తానని మాయ మాటలతో మహిళలను లైంగికంగా దోపిడీ చేయడం నేరం.
ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.
తన ఐడెంటిటీని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.
అయితే, ఈ సెక్షన్‌లోని నేరాలు ‘రేప్’ కేటగిరీలోకి రావు.
ఐపీసీ: పెళ్లి చేసుకుంటానని మాయ మాటలతో లైంగికంగా దోపిడీ చేసిన ఘటనలకు సంబంధించి ఐపీసీలో ఎలాంటి ప్రత్యేకమైన, స్పష్టమైన నిబంధనలూ లేవు. అలానే ఉద్యోగం, ప్రమోషన్ల పేరుతో లైంగిక దోపిడీ విషయంలోనూ అంతే.
ప్రస్తుతం ఇలాంటి చర్యలు ఐపీసీలోని సెక్షన్ 90 కిందకు వస్తున్నాయి. ఇక్కడ మోసపూరితంగా తీసుకున్న అనుమతి చెల్లదు. దీంతో సెక్షన్ 375 కింద ఆరోపణలు నమోదు చేయొచ్చు. ఈ సెక్షన్‌లో రేప్ లాంటి నేరాలను నిర్వచించారు.
రేప్ కేసులు
ఐపీసీ: సెక్షన్ 376లో రేప్‌ను తీవ్రమైన నేరంగా నిర్వచించారు. దీనికి పదేళ్లకుపైనే శిక్ష విధిస్తున్నారు. దీన్ని అవసరమైతే జీవిత ఖైదు వరకూ పెంచొచ్చు.
అదే పోలీసు అధికారి, ప్రభుత్వ ఉద్యోగి, సాయుధ బలగాల సిబ్బంది, హాస్పిటల్ ఉద్యోగులు, బాధిత మహిళ బంధువులు తదితరులు మహిళలకు ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేప్‌కు పాల్పడితే మరింత కఠినమైన శిక్షలనూ విధించొచ్చు.
ఇలాంటి కేసులో నిందితుడు దోషిగా నిరూపణ అయితే, తన మిగిలిన జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంటుంది.
ప్రతిపాదిత బిల్లు: సెక్షన్ 64లో దీనికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అయితే, వీటిలో ఎలాంటి మార్పులూ చేయలేదు.
16 ఏళ్ల కంటే చిన్న వయసున్న బాలికలపై రేప్
ఐపీసీ: సెక్షన్ 376-డీ(ఏ) ప్రకారం ఈ నేరానికి 20 ఏళ్లకు పైనే జైలు శిక్షతోపాటు జరిమానా విధించొచ్చు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు విధిస్తారు. అంటే సదరు వ్యక్తి జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంటుంది.
ప్రతిపాదిత బిల్లు: ఎలాంటి మార్పూ లేదు.
12 ఏళ్ల కంటే చిన్న వయసున్న బాలికలపై రేప్
ఐపీసీ: సెక్షన్ 376ఏబీ ప్రకారం ఈ నేరం రుజువైతే 20 ఏళ్లకుపైనే జైలు శిక్ష విధిస్తారు. ఈ కేసుల్లో జీవిత ఖైదుతోపాటు జరిమానా విధించే అవకాశముంది. అవసరమైతే మరణ శిక్ష కూడా విధించేందుకు నిబంధనలు ఉన్నాయి.
ప్రతిపాదిత బిల్లు: సెక్షన్ 65(2)లో ఈ నేరాల నిబంధనలు ఉన్నాయి. వీటి శిక్షల్లో ఎలాంటి మార్పూ లేదు.
మైనర్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడితే..
ఐపీసీ: సెక్షన్ 376డీలో గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఈ నేరం రుజువైతే 20 ఏళ్లకుపైనే శిక్షపడే అవకాశముంది. ఈ శిక్షను జీవిత ఖైదు వరకూ పెంచొచ్చు. అంటే ఆ వ్యక్తి తన శేష జీవితాన్ని పూర్తిగా జైలులోనే గడపాల్సి ఉంటుంది. బాధిత బాలిక వయసు 12 ఏళ్లకు లోపు ఉంటే, మరణ శిక్ష విధించే అవకాశమూ ఉంది.
కొత్త బిల్లు: సెక్షన్ 70(2)లో గ్యాంగ్ రేప్‌కు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. బాధిత బాలిక వయసు 18 ఏళ్లకు లోపు ఉంటే మరణ శిక్ష విధించేలా మార్పులు చేశారు.
మారిటల్ రేప్‌కు పాల్పడితే..
ఐపీసీలోని సెక్షన్ 375లో రేప్‌ను నిర్వచించారు. అయితే, ఇక్కడ ఎక్సెప్షన్ 2 పేరుతో ఒక మినహాయింపు ఉంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టుతోపాటు కొన్ని హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
ఎక్సెప్షన్ 2 ప్రకారం, 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న భార్యతో లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదు. ఇక్కడ భార్య అనుమతి లేకపోయినప్పటికీ దీన్ని నేరంగా చూడకూడదు.
నిర్భయ రేప్ కేస్ అనంతరం మారిటల్ రేప్‌పై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని జస్టిస్ వర్మ కమిటీ కూడా సూచించింది. పెళ్లి తర్వాత కూడా లైంగిక చర్యలో భార్య అనుమతి తప్పనిసరిగా ఉండాలని కమిటీ సూచించింది.
ప్రతిపాదిత బిల్లు: దీనిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. మారిటల్ రేప్ అనే పదాన్ని కూడా ఉపయోగించలేదు.
లైంగిక వేధింపులు
ఐపీసీలోని సెక్షన్ 354లో లైంగిక వేధింపులను నిర్వచించారు. 2013లో క్రిమినల్ లా అమెండమెంట్ యాక్ట్ ద్వారా ఈ సెక్షన్‌లో నాలుగు కొత్త సబ్ సెక్షన్‌లు చేశారు. దీనిలో ఒక్కో నేరానికి ఒక్కోలా శిక్షలు విధించారు.
ఐపీసీ: 354 ఏ ప్రకారం, ఒక మహిళను లైంగిక దాడి ఉద్దేశంతో తాకినా లేదా ప్రవర్తించినా లేదా లైంగిక కోరికలు తీర్చాలని కోరినా లేదా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పోర్న్ చూపించినా మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధించొచ్చు.
లైంగిక దాడి ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలకు కూడా ఏడాది వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశముంది.
354బీ: మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె బట్టలను తొలగించినా లేదా తొలగించేందుకు ప్రయత్నించినా మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించొచ్చు.
354 సీ: అనుమతి లేకుండానే మహిళల ప్రైవేటు చర్యల ఫోటోలు, వీడియోలు తీయడం కూడా నేరం. దీనికి ఏడాది నుంచి మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించొచ్చు. మళ్లీ మళ్లీ ఈ నేరానికి పాల్పడితే శిక్షను మూడు నుంచి ఏడేళ్లకు పెంచొచ్చు. జరిమానా కూడా విధించొచ్చు.
ప్రతిపాదిత బిల్లు: సెక్షన్ 74 నుంచి 76ల వరకూ ఈ నేరాలను నిర్వచించారు. అయితే, దీనిలో ఎలాంటి మార్పులు లేవు.
మహిళలను ఇంటర్నెట్లో వేధిస్తే…
సదరు మహిళ వద్దని చెప్పినప్పటికీ, పదేపదే వెంబడించినా, పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఆమెను ఇంటర్నెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విభాగాల్లో పదేపదే వేధించినా నేరమే.
ఐపీసీ: సెక్షన్ 354డీ లో దీన్ని నిర్వచించారు. మొదటిసారి నేరానికి దీనిలో మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. మళ్లీ మళ్లీ ఈ నేరానికి పాల్పడితే ఈ శిక్షను ఐదేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించొచ్చు.
ప్రతిపాదిత బిల్లు: సెక్షన్ 77లో ఈ నేరాలను నిర్వచించారు. అయితే, శిక్షల్లో ఎలాంటి మార్పులూ లేవు.
దూషిస్తే..
మహిళను కించపరచాలనే ఉద్దేశంతో దూషించినా, సంజ్ఞలు చేసినా లేదా ఏదైనా వస్తువులను చూపించినా నేరమే.
ఐపీసీ: సెక్షన్ 509 ప్రకారం, ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించొచ్చు.
ప్రతిపాదిత బిల్లు: దీనిలో ఎలాంటి మార్పులూ లేవు.
వరకట్న హత్యలు..
పెళ్లైన ఏడేళ్లలోపే శరీరంపై కాలిన గాయాలు లేదా ఇతర గాయాలతో మరణించినా లేదా అనుమానాస్పద స్థితిలో చనిపోయినా లేదా మరణానికి ముందు ఆమె భర్త లేదా బంధువుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నా దీన్ని వరకట్న హత్యగా భావిస్తారు.
ఐపీసీలోని సెక్షన్ 304బీ ప్రకారం ఈ నేరానికి ఏడేళ్లకుపైనే జైలు శిక్ష విధించొచ్చు. ఈ శిక్షను జీవిత ఖైదు వరకూ పొడిగించొచ్చు.
ప్రతిపాదిత బిల్లు
సెక్షన్ 79లో వరకట్న హత్యను నిర్వచించారు. అయితే, శిక్షలో ఎలాంటి మార్పులూ లేవు.