తరావీహ్ నమాజ్ ప్రాముఖ్యత
రమజాన్ మాసంలో ప్రత్యేకంగా చేసే నమాజ్ ‘తరావీహ్ నమాజ్. * ఇది ప్రవక్త(స) వారి సున్నత్ అంటే, సంప్రదాయం. రమజాన్ మాసంలో వీలయినంత అధికంగా దైవారాధన, దైవధ్యానం చేయాలనీ, ఈమాసంలో దివ్యఖుర్ఆన్ కనీసం ఒకసారి అయినా పూర్తిగా పారాయణం చేయాలని మహనీయులు ముహమ్మద్(స) తెలిపారు.
ప్రతిరోజు చేసే ఐదు పూటల నమాజ్లలో ఇషా నమాజ్ చివరిది. తరావీహ్ నమాజ్ను ఇషా నమాజు తరువాత చదవాలి. దీనిని వ్యక్తిగతంగా లేదా సామూహికంగా చేయవచ్చు. అయితే పురు షులు సామూహికంగా మస్జిదులో చెయ్యడం ఎంతో ఉత్తమం. స్త్రీలు తమ ఇండ్లలో చేసుకోవడం మంచిది.
తరావీహ్ అంటే?
తరావీహ్ అనేది ‘రాహత్’ అనే పదం నుంచి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం. కాబట్టి ఇది విశ్రాంతి తీసుకొని చేయ వలసిన నమాజ్ అని భావం, తరావీహ్ నమాజ్న రెండేసి రకాతులు చెయ్యమని ప్రవక్త(స) తెలిపారు.తరావీహ్ నమాజ్ ఎన్ని రకాతులు చేయాలి అనే విషయమై రెండు ఉల్లేఖనాలున్నాయి. ప్రవక్త(స) ఈ నమాజ్ ఎనిమిది రకాతులు చదివినట్లు ఆధారాలు ఉన్నాయి, అలాగే హజ్రత్ ఉమర్ (రజి) ఇంకా ఇతర సహచరుల ద్వారా ప్రవక్త(స) ఇరవై రకాతులు చదివినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సంఘర్షణలకు తావులేదు. దివ్యఖుర్ఆన్ అరబీ భాషలో అవతరించింది. దీనిలో 30 అధ్యా యాలు ఉన్నాయి. ఈ ముప్పై అధ్యాయాలను రమజాన్ మాసం లోని తరావీహ్ నమాజ్లో రోజుకు ఒకటి చొప్పున చదవడం జరుగుతుంది. తరావీహ్ నమాజ్ తరువాత ప్రతిరోజు చదివిన అధ్యాయం అర్థాన్ని వీలయిన భాషలో చదవడం లేదా వినడం తప్పకుండా చెయ్యాలి.
తద్వారా దివ్యఖుర్ఆన్ అర్ధం తెలుస్తుంది. ఒక వ్యక్తి తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు భోంచేసి సాయంత్రం ఆరున్నర గంటల వరకు అంటే దాదాపు 14 గంటలు ఉపవాస వ్రతాన్ని పాటించి బాగా అలసిపోయి ఉంటాడు. అయినా ఒక ఉపవాసి ఇషా నమాజ్, తరావీహ్ నమాజ్లో లీనమై పోతాడు. దీనికి కారణం మనిషిలో భయభక్తులు ఉండటమే. ” ఈ త్యాగనిరతికి గుర్తుగా మహనీయ ప్రవక్త(స) ఇలా తెలిపారు: ప్రళయదినాన తరావీహ్ సమాజ్లో చదివిన లేదా విన్న దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సిఫారసు చేస్తుంది: ‘ప్రభూ! ఫలానా వ్యక్తి తన మధురమైన నిద్రను త్యాగం చేసి నన్ను (దివ్య ఖుర్ఆన్ను) చదివాడు. కనుక ప్రభూ! నీవు నా సిఫారసును స్వీకరించి ఇతని పాపాలను క్షమించి స్వర్గంలో ప్రవేశంపజెయ్యి వెంటనే ఆ సిఫారను స్వీకరించబడుతుంది. ఒక విశ్వాసికి ఇంతకంటే పెద్ద వరం ఇంకేమి కావాలి.
అందుకే మనమంతాతప్పకుండా తరావీహ్ నమాజ్ ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు సాఫల్యం దక్కుతుంది. మహాప్రవక్త(స) సహబా రెండేసి రకాతుల చొప్పున తరావీహ్ నమాజ్ చేసేవారు. ప్రతి నాలుగు రకాతుల తరువాత కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. విశ్రాంతి సమయంలో దైవధ్యానం (జిక్ర్)గాని, నఫిల్ నమాజ్ గాని చెయ్యవచ్చు. దైవప్రవక్త(స) కాలంలో మక్కా ప్రజలు కాబా ప్రదక్షిణ చేసేవారు. అలాగే మదీనాలోని ప్రజలు నాలుగు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు.తరావీహ్ నమాజ్ లో ఎక్కువసేపు ఖియాం అంటే చాలాసేపు నిలబడి ఉండటం సంప్రదాయం (మస్నూన్). అదేవిధంగా దివ్య ఖుర్ఆన్ మెల్లగా, నిబద్ధతతో. ఆగిఆగి పఠించడం కూడా చాలా అవసరం. జమాఅత్ తరావీహ్ నమాజ్ చేసేవారు వితర్ నమాజ్ కూడా జమాఅత్ తో చేయడం ఉత్తమం.
అల్లాహ్ మనందరికీ భక్తిశ్రద్ధలతో తరావీహ్ నమాజ్ ను ఆచరించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక!
షేక్ మదర్ సాహెబ్
9440449642