నర్సరీ కార్మికులకు అన్యాయం చేస్తే ఉద్యమమే…
ఆర్జీ-1 కార్యాలయం ముట్టడి సహా ఆందోళనలకు సిద్ధం….
హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరిక…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, సింగరేణి ఆర్జీ-1 నర్సరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తూ, వారి ఉపాధికి ఆటంకం కలిగిస్తే యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరించారు.
ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నర్సరీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్న కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులనే కొనసాగించాలని, ఇతర విభాగాల పార్కుల నుంచి కార్మికులను తీసుకొచ్చి నర్సరీ పనులు చేయించడం సరైన విధానం కాదని అన్నారు.
పార్కు కార్మికులు, నర్సరీ కార్మికుల మధ్య వివాదాలు తలెత్తితే అందుకు సింగరేణి అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నర్సరీ పనిపై అవగాహన లేని బయటి కార్మికులతో పనులు చేయించడం వల్ల సుమారు 20 వేల మొక్కలు ఎండిపోయాయని ఆయన ఆరోపించారు.
నర్సరీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదని, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకుని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. నర్సరీ నిర్వహణను కార్మికుల సహకార సంఘానికి (సొసైటీ) అప్పగించాలని కోరారు.
కార్మికుల రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే ఆర్జీ-1 కార్యాలయం, నర్సరీ ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. యాజమాన్యం మొండివైఖరి వీడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని, మాస్టర్ బేసిక్ విధానంలో ప్రత్యేక టెండర్లు పిలిచి కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరారు.
అలాగే సీనియర్ నర్సరీ కార్మికులకు క్రమం తప్పకుండా పని కల్పించి, ఈపీఎఫ్, బోనస్, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పద్మ, రాజేశ్వరి, వనమాల, లక్ష్మి, శారద, సుజాత, రాజనర్సు, కొమరక్క, వనిత, మహేశ్వరి, లచ్చమ్మ, కనకలక్ష్మి తదితర నర్సరీ కార్మికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
