SAKSHITHA NEWS

ప్రజలను ఇబ్బంది పెడితే…అంబులెన్సు కన్నా వేగంగా వస్తాం

  • పెద్దమందడిలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి

మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో ఆర్టీసీ అధికారులు

రైతుల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం

—- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
.
సాక్షిత వనపర్తి
నియోజకవర్గంలో పేద ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వస్తే… అంబులెన్సు కన్నా వేగంగా వస్తామని…ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా…ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు.

రాచాల మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఆయన నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమానికి మండల కేంద్రంలోని ప్రజల నుండి అన్యూహ స్పందన లభించింది.

ముందుగా మండల కేంద్రం లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మండల కేంద్రంలోని అన్ని వీధుల గుండా మార్నింగ్ వాకింగ్ లో భాగంగా పర్యటిస్తూ సమస్య లను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మండల కేంద్రం లోని బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ను అందించిన ఘనత పెద్ద మందడి మండలానికి దక్కిందన్నారు.

ఇటు జిల్లా కేంద్రానికి అటు జాతీయ రహదారికి సమీపంలో మండల కేంద్రం ఉన్నప్పటికి అభివృద్ధి చెందడంలో మాత్రం వెనుకంజలో పడిపోయిందన్నారు.

పేరుకే పాత మండలం అయినా గత ప్రభుత్వంలో నాయకులు కేవలం ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప అభివృద్ధి చేయాలని అలోచించిన పాపాన పోలేదని, చివరికి బస్సు సౌకర్యం కూడా లేకపోవడం చూస్తుంటే అర్థం చేసుకోవచ్చన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమందడి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని మరియు ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు నిర్మించి, బస్సులను రెగ్యులరుగా నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు రాచాల దృష్టికి తీసుకురాగా…రైతాంగానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కృతనిశ్చయంతో ఉన్నాడని, ఆ దిశగా ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని ఆయన రైతులకు వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని,, బీసీ యువకుడిని పోలీసులు కొడితే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విద్య, ఉపాధి మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టీ ఆమోదింపజేయడం అభినందనీయమన్నారు.

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో పెట్టీ ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి డిపో మేనేజరును కలిసి పెద్దమందడికి బస్సులు లేక ప్రయాణికులు ఎదుర్కొంటున్న అవస్థలపై మాట్లాడారు.

స్పందించిన డిఎం పెద్దమందడి మండల కేంద్రానికి రేపటి నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని, అదేవిదంగా ఆర్టీసీ బస్టాండులలో సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పెద్దమందడి మాజీ సర్పంచ్ వెంకటస్వామి సాగర్, బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, మండల అధ్యక్షుడు రమేష్ సాగర్, నాయకులు వివి గౌడ్, గిరిజా సురేందర్, బత్తుల జితేందర్, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, దేవర శివ, రాఘవేందర్ గౌడ్, నాగరాజు యాదవ్,తిరుపతయ్య గౌడ్, పాండురంగ, నరసింహ, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app