రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్‌మ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ ఛైర్మన్ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
జేఎన్‌జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిందని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిసారించామని తెలిపారు. సమావేశంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.