శాస్త్రీయ యాజమాన్యంతో ఆయిల్ పామ్‌లో అధిక దిగుబడులు సాధ్యం….
–డా. కె.రామచంద్రుడు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: ముత్తారం,
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ముత్తారం మండలంలో ఆయిల్ పామ్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, అనంతరం ఆయిల్ పామ్ తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (IIOPR), పెదవేగి, ఏలూరు జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డా. కె. రామచంద్రుడు హాజరై ఆయిల్ పామ్ సాగులో రైతులు అనుసరించాల్సిన శాస్త్రీయ యాజమాన్య విధానాలను వివరించారు.
ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో సమతుల్య పోషక యాజమాన్యం, సమగ్ర పురుగు–తెగుళ్ల నివారణ, సరైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పరాగసంపర్కానికి అవసరమైన కీటకాల చురుకుదనం తగ్గడం, ఫలదీకరణ సరిగా జరగకపోవడం, గెలలు ప్రారంభ దశలోనే రాలిపోవడం (బంచ్ ఫెయిల్యూర్) వంటి సమస్యలకు గల కారణాలను శాస్త్రీయంగా వివరించారు.
పెద్దపల్లి జిల్లాలో నాలుగో సంవత్సరం ఆయిల్ పామ్ తోటల నుంచి మంచి దిగుబడులు రావడం శుభపరిణామమని పేర్కొన్న ఆయన, జిల్లాలోని వాతావరణ పరిస్థితులు ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని చెప్పారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకుని జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన డా. రామచంద్రుడు పంటలో కనిపిస్తున్న సమస్యలను గుర్తించి, వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై సూచనలు చేశారు. రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇస్తూ శాస్త్రీయ సిఫార్సులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాం ప్రసాద్, తిరుమల ఆయిల్ కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కేశు కళ్యాకర్, ఉద్యాన అధికారి ఎ. జ్యోతి, ఉద్యాన విస్తరణ అధికారి రాజశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్లు అజయ్, రంజిత్, రైతులు సమ్మయ్య, బుచ్చంరావు, లింగారావు, రాజేశ్వరరావు, సంపత్ రెడ్డి, పోల్గోనారు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
