ఆధునిక సాంకేతికతతో భూముల రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి…

Sakshitha news

ఆధునిక సాంకేతికతతో భూముల రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి….

–రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: :
భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని, తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు వెల్లడించారు.

డీజీపీఎస్ , రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాణ్యతతో కూడిన రీ సర్వే చేపట్టాలని సూచించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించాలని, వారికి ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుందని తెలిపారు. సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు తదితర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో వినియోగించాలని, లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరును శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.

భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సాధారణ విధుల నిర్వహణకు కూడా కోర్టు ఆదేశాలు అవసరమా అని ప్రశ్నించిందన్నారు. ప్రతి అధికారి వద్ద ఉన్న పెండింగ్ దరఖాస్తులపై హైకోర్టు వివరణ కోరిందని, నాలుగు వారాల గడువు ఇచ్చిందని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల్లో భూ భారతి దరఖాస్తులు 60 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో రెండు కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాలకు పరిపాలనా అనుమతులు లభించాయని, ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ డీఆర్‌ఓ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ బి. ప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి సోమేశ్వర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top