గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి….
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
గ్రామాల అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామాల్లోని సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను వినియోగించుకొని పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అయితేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగిన ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల అవసరాల కోసం నిర్మిస్తున్న వీఓ భవనాల పనులను వేగవంతం చేయాలని, ప్రతి గ్రామపంచాయతీ రాబోయే మూడు సంవత్సరాల కాలానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రణాళికలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఇందిరమ్మ గృహాల ఎంపిక ప్రక్రియలో కమిటీలు ప్రతిపాదించిన అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) సమన్వయ బాధ్యతలు చేపట్టి తమ పరిధిలోని గెజిటెడ్ అధికారులకు ధృవీకరణ బాధ్యతలు అప్పగించాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
