అచ్చంపేటలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
విజేతలకు బహుమతులు అందించిన శ్రీమతి నంబూరు వసంత కుమారి
అచ్చంపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , వారి సతీమణి శ్రీమతి నంబూరు వసంతకుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగిన వేడుకల్లో భాగంగా భోగి మంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా శ్రీమతీ నంబురు వసంతకుమారి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ముగ్గుల పోటీలు అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మహిళా పక్షపాతి అని.. మహిళల పేరు మీద ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తే.. కుటుంబాలు బాగుంటాయన్న దూరదృష్టితో ఆలోచించి వారికి అండగా నిలుస్తున్నారన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అన్నారు. ఎంతదూరమెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. సొంతూరికి తెప్పించే పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతోనే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు యువ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి బహుమతి ప్రదానం చేశారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి ధనలక్ష్మి రూ.40 వేలు గెలుచుకున్నారు. రెండో బహుమతి రూ.25 వేలు,మూడో బహుమతి రూ.15 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు,ఐదో బహుమతి కింద రూ.5 వేలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.