Governor Tamilisai into public domain
ప్రజాక్షేత్రంలోకి గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై క్షేత్రస్థాయి సందర్శనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. గవర్నర్ రాజ్‌భవన్‌కే పరిమితంకాదు ప్రజాక్షేత్రంలోనూ వాస్తవాలపై తమిళిసై స్వయంగా అద్యయనం చేయడానికి సమాయాత్తమయ్యారు. తొలుత హైదరాబాద్‌లోని ఆస్పత్రులను సందర్శించి అక్కడి స్థితిగతులను తెలుసుకోనున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరంలో అస్వస్థతకు గురైన మహిళలు నలుగురు మృత్యువాతపడ్డారు.
ఈ ఘటన గవర్నర్ తమిళిసైని చలింపజేసింది.దీంతో తెలంగాణలో సర్కారు ఆస్పత్రుల పనితీరు, అందుతున్న వైద్యసేవలు తెలుసుకుని,అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనతో గవర్నర్ తమిళిసై స్పందించారు.బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.అదే తరహాలో తెలంగాణ వ్యాప్తంగా దశలవారీగా ప్రభుత్వ ఆస్పత్రులు, యూనివర్శిటీల్లో గవర్నర్ తమిళిసై సందర్శించబోతున్నారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిసరాల్లోని మారుమూల గ్రామాలను సందర్శించారు.ప్రజలతో నేరుగా మాట్లాడితేనే వాస్తవాలు తెలుస్తాయనే భావన తమిళిసైలో వ్యక్తమవుతోంది.తెలంగాణ గవర్నర్ గా తన మూడేళ్ళ పదవి కాలం పూర్తైన సమయంలో మూడేళ్ళ కాలంలో తనకు ఎదురైన అనుభవనాలను వివరిస్తూ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన గతంలో ఎన్నడూ లేనంతగా ఘాటుగా విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వనికి ఎంతగా సహకారం అందించాలని భావించినా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక మీదట మరింత దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నారు.మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో నెలకొన్న వివిధ సమస్యలపై కేసీఆర్ కు నివేదికలు పంపిన గవర్నర్ ఇక మీదట వరుసగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించనున్నారని సమాచారం.
తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత గవర్నర్ పర్యటన ఉంటుందని సమాచారం.గాంధీ, ఉస్మానియా ఆసుపత్రి,పేట్ల బురుజు ఉమన్స్ హాస్పిటల్,ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్ లాంటి ఆసుపత్రులను గవర్నర్ నేరుగా సందర్శించే ఆవకాశం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేనంతగా తెలంగాణలో వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవడంతో ఇక గవర్నర్ నేరుగా ఆసుపత్రులను విసిట్ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లడనున్నారు.
తమిళ్ సై యూనివర్సిటీల బాట సందర్భంగా నెలకొన్న ఇబ్బందులపై బాహాటంగానే విమర్శలు చేశారు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విసి హోదాలో సందర్శించిన తనపై రాజకీయ విమర్శలు చేయడం పట్ల స్పందించిన తమిళ్ సై ఆసుపత్రుల్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదురైనా, ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో గవర్నర్ పర్యటన చేపట్టనున్నారు.
పర్యటనకి సంబంధించిన షెడ్యూల్ కూడా రాజ్ భవన్ అధికారులు ఖరారు చేశారు.