ప్రజల గుమ్మానికి పాలన… సమస్యల పరిష్కారంలో వేగం పెంచిన మేయర్…
విద్యుత్, డ్రైనేజ్, రోడ్ల సమస్యలపై ఫోకస్… వార్డు సందర్శనలో మేయర్ ఆదేశాలు….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డు బాట పట్టామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా 2వ డివిజన్, జంఘాలపల్లి, న్యూ పోరట్‌పల్లి ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వెంగళ బాపుతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎన్‌టీపీసీ నాలా కారణంగా ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపుకు గురవుతోందని తెలిపారు. దశాబ్దాలుగా నాలాలో పూడిక తొలగించకపోవడంతో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీరు చేరుతున్నదని చెప్పారు. ఈ విషయమై ఎన్‌టీపీసీ అధికారులను సంప్రదించగా వారు పూడిక తొలగింపుకు అంగీకరించారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఈసారి వరద ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎస్‌టీకాలనీలో వంతెన నిర్మాణం కోసం కూడా ఎన్‌టీపీసీ అధికారులను కోరినట్లు తెలిపారు. రెండో డివిజన్‌లో కొన్ని ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం ఉందని గుర్తించామని, త్వరలో పనులు చేపడతామని అన్నారు.
స్థానికులు సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయగా, వెంటనే త్రీ ఫేజ్ సరఫరా కల్పించాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వంగిపోయిన, శిధిలమైన స్తంభాలను తొలగించాలని కూడా ఆదేశించారు.
పైప్‌లైన్‌లు ఉన్నప్పటికీ నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేయలేదని గమనించామని, మున్సిపల్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పించి కనెక్షన్లు అందిస్తామని చెప్పారు. నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలువలు, రోడ్లపై చెత్త వేయకూడదని, ఆక్రమణలు చేయవద్దని సూచించారు.
మేయర్ ఆదేశాల మేరకు మెప్మా, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. పలు వీధుల్లో రోడ్లకు అడ్డుగా ఉన్న పిచ్చి చెట్లు, కొమ్మలను తొలగింపజేసి, ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి, నగర పాలక సంస్థ ఎస్.ఈ. గురువీర, ఈ.ఈ. పి.వి. రామన్, టీపీఎస్ నవీన్, డి.ఈ.ఈ. జగదీష్, షాభాజ్, ఏఈ జమీల్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, నాయకులు దాసరి విజయ్, వెంగళ పద్మలత, మెప్మా ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ద్వారా సిబ్బంది, అధికారులకు అల్పాహారం అందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY