విద్యా వ్యవస్థలో నిర్లక్ష్యానికి తావులేదు, ఆకస్మిక తనిఖీలో డీఈఓ హెచ్చరిక….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద, సమగ్ర శిక్ష ప్రణాళిక సమన్వయకర్త మల్లేష్ గౌడ్ బుధవారం పెద్దపల్లి మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందిని గుర్తించి హాజరు పట్టికలో నమోదు చేశారు.
ఆకస్మిక తనిఖీ అనంతరం విద్యా వనరుల కేంద్ర సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కుల వివరాల నవీకరణ, విద్యార్థుల తరగతి ప్రమోషన్ ప్రక్రియల పురోగతిని సమగ్రంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి జారీ అయ్యే ఆదేశాలకు సకాలంలో స్పందిస్తూ అప్పగించిన బాధ్యతలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి హెచ్చరించారు.

