గుండె పోటు తో మాజీ సర్పంచ్ మృతి
అవినీతి రహిత రాజకీయ నేత
ప్రజా ఉద్యమంలోనూ నారాయణ సేవలు మరువలేనివి
మా ఊరికే ఉత్తముడు “కొమ్మునేని నారాయణ”
సాక్షిత బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ మాజీ సర్పంచ్ కొమ్మునేని నారాయణ (56) వారం ఉదయత్ పూర్వం 2-00 గంటలకు గుండె పోటు తో మృతి చెందారు. ఆయన మాజీ సర్పంచ్ గా గతంలో ఐదేండ్లు గ్రామానికి సేవలు చేశారు. తాజాగా ఆయన భార్య సుశీల కూడా సర్పంచ్ గా ఐదేండ్లు గ్రామానికి సేవలు చేసి ప్రజల మెప్పు పొందారు. అంతకు పూర్వం వన సంరక్షణ సమితి చైర్మన్ గా కూడా కొమ్మునేని నారాయణ సేవలు అందించారు. ప్రజా ఉద్యమ కారునిగా కూడా నారాయణ సేవలు మరువలేమని గ్రామస్తులు, వివిధ ప్రాంతాల ఉద్యమ కారులు ఆయన సేవలను, త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రజా ఉద్యమంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టాలను – కష్టాలను అనుభవించారు. రైతు కుటుంబంలో జన్మించి భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికిన నారాయణ కుటుంబం నలుగురి నోళ్ళలో నేడు మెదలక తప్పడం లేదు. “మా ఊరికే ఉత్తముడు” ఈ కొమ్ము నేని నారాయణ అంటూ శవ యాత్రలో గోపులాపూరు వాస్తవ్యులు ఆయన గురించి కొనియాడారు.
“అవినీతి రహిత రాజకీయ నేత” గా కొమ్మునేని నారాయణ పేరుగాంచాడు. మంగళ వారం ఉదయం గోపులాపూర్ లో జరిగిన ఆయన అంత్య క్రియల్లో వివిధ శాఖల అధికారులు, తాజా – మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో శవ యాత్ర లో పాల్గొని కన్నీరు కార్చారు. నారాయణ సేవలు, ఆయన మంచి తనం గురించి ఒకరికొకరు వివరించుకున్నారు. నారాయణ పంచుకున్న గత జ్ఞాపకాలను అన్నింటినీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, గ్రామస్తులు నెమరు వేసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సమన్వయం ఏర్పరచుకొని గ్రామానికి మరువ లేని సేవలు అందించిన నారాయణ మృతి పట్ల అందరూ విచారం వ్యక్తం చేశారు. ఇన్ని ఏండ్లుగా ప్రజా ప్రతినిధులుగా, నాయకునిగా కొనసాగి నిస్వార్థం తో ప్రజలకు సేవలు అందించి, అవినీతి ఎరుగని ఆ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా సహకరించాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు, విద్యావంతులు, గ్రామస్తులు ముచ్చటించుకున్నారు.
కాగా… మృతుడు కొమ్మునేని నారాయణ కు భార్య సుశీల, ఇద్దరు కుమారులు – కోడండ్లు, ఇద్దరు కూతుర్లు – అల్లుండ్లు ఉన్నారు. వారంతా కూడా వారి – వారి పనుల్లో లీనమవుతూనే… జ్ఞానవంతులుగా నారాయణ సేవల్లో కూడా పాలు పంచుకోవడం, ప్రజా సేవకు సహకరించడం హర్షణీయం.