Farmers get profitable and high yielding agriculture
రైతులు లాభసాటి, అధిక దిగుబడుల సాధించే వ్యవసాయం చేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలి……….. జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి
సాక్షిత వనపర్తి జిల్లా రైతులు అధిక దిగుబడులు సాధించి లాభసాటి వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోక్ నాథ్ రెడ్డి సూచించారు.
గురువారం జడ్పి సమావేశ మందిరంలో జరిగిన 3, 4వ స్థాయి సంఘం సమావేశాలకు జడ్పి చైర్మన్ అధ్యక్షత వహించారు.
3వ స్థాయి సంఘ సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖల పై చర్చ జరుగగా నాల్గవ స్థాయి సంఘ సమావేశంలో విద్యా వైద్యం పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో చాలా సారవంతమైన భూములు, వ్యవసాయానికి అనువైన వాతావరణం ఉంటుందనీ దీనిని సద్వినియోగం చేసుకొని రైతులు అధిక దిగుబడితో పాటు లాభసాటి వ్యవసాయం చేసేవిధంగా రైతులను అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే రైతులు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని, దీనిని అధిగమించడానికి విద్యార్థులను క్షేత్రస్థాయిలో వ్యవసాయం పై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే తరం యువత వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో లాభసాటి వ్యవసాయం చేసేవిధంగా ఇప్పటి నుంచే చొరవ తీసుకోవాలని సూచించారు.
పామాయిల్, పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి పంటల వైపు రైతులను మల్లించాలని అందుకు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి కొయ్యాలను కాల్చకుండ సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు.
భూసారం పెంచి, ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులలో దేశం స్వయం సమృద్ధి సాధించే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
రైతులు వ్యవసాయ రుణాలు రెన్యువల్ చేసుకోకుంటే 11 నుండి 12 శాతం వడ్డీ వేస్తారని దానితోపాటు సిబిల్ స్కోర్ పడిపోయి బిడ్డల చదువులకు సైతం బ్యాంకులు రుణాలు ఇవ్వరని అన్నారు. అందువల్ల వ్యవసాయ రుణాలు రెన్యువల్ చేయించాలని ఇందుకు బ్యాంకులు సైతం ముందుకు వచ్చి వడ్డీ తీసుకొని రుణాలు రెన్యువల్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.
పంటల బీమా పై రైతులకు అవగాహన కల్పించి అన్ని పంటలకు భీమా చేయించాలని తెలిపారు. వనపర్తి లో కూరగాయలు నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వచ్చే హరిత హారం కొరకు సన్నద్ధం కావాలని సూచించారు.
అధికారులు తమ వద్ద ఉన్న వనరులతో రైతులకు మేలు చేయాలని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
జడ్పి సి.ఈ.ఒ. యాదయ్య, జడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్, పెద్దమందడి జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఆత్మకూరు జడ్పీటీసీ శివరంజని, జిల్లా వ్యవసాయ అధికారి డి. చంద్రశేఖర్, ఉద్యాన వన జిల్లా అధికార సురేష్, మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప, పశు సంవర్థక శాఖ అధికారి కే. వేంకటేశ్వర రెడ్డి, భూగర్భ జలాలు అధికారి మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అమోల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.