రైతు సంక్షేమమే లక్ష్యం – వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు…
–ఎమ్మెల్యే విజయరమణ రావు..
….

సాక్షిత పెద్దపల్లి : రైతును రాజుగా చూడాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. ఓదెల మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, పోత్కపల్లి, శానగొండ, బాయమ్మపల్లి, ఇందుర్తి, గుంపుల, గూడెం గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మద్దతు ధరకు, ఎలాంటి కటింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమిస్తూ సాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో ప్రస్తుతం సాగునీరు సమృద్ధిగా అందుతోందని, రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు.
రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, వరి కోత సమయంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతులకు బోనస్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గతంలో రైతులకు బోనస్ ఇవ్వకుండా మోసం చేశారని విమర్శిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఓదెల మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY