రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని ఈనాడు కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానేతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కూడా ఆయన దేశ ఏకత్వం కోసం పోరాడారని కొనియాడారు. ఇందిరా గాంధీ త్యాగస్ఫూర్తిని కొనసాగిస్తూ యువ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాల రక్షణ కోసం 1989లో అట్రాసిటీస్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
యువతకు ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఆయన తీసుకున్నారని తెలిపారు. కేవలం ఐదు సంవత్సరాల పాలనలోనే దేశానికి దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా రోడ్‌మ్యాప్ రూపొందించిన నాయకుడిగా రాజీవ్ గాంధీ నిలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడటానికి గాంధీ కుటుంబ త్యాగాలే కారణమని తెలిపారు. ప్రస్తుతం దేశంలో విద్వేష రాజకీయాలు పెరుగుతున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో మార్పుల పేరుతో ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మందుల సూర్య కిరణ్, గుడిపాటి నర్సయ్య, అంజద్, చకిలం రాజేశ్వరరావు, మొరిశెట్టి నివేదిత లక్షాధి, రవి బాబు, తండు శ్రీనివాస్ యాదవ్, ఎలిమినేటి అభినయ్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, కొనతం రాజేష్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, సండ్రపటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
