కొవ్వూరు రైల్వే లైన్ సంగతేమిటో తేల్చండి
కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏవి?
కొత్తగా ఎన్ని రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశారు?
లోక్ సభలో రైల్వే ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు లిఖితపూర్వక ప్రశ్న
దేశ వ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన, మంజూరు చేసిన కొత్త రైల్వే ప్రాజెక్టుల వివరాలను రాష్ట్రాల వారీగా తెలియజేయాలని లోక్ సభలో బీఆర్ఎన్ పార్టీ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరారు. అదే విధంగా తెలంగాణలో భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైల్వే మార్గానికి సంబంధించి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించాలని కోరారు. ఈ రైలు మార్గానికి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, భద్రాచలం పుణ్యక్షేత్రం, అంతర్గత గిరిజన ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే ఈ రైలు మార్గాన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలియజేయాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. అయితే భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ కోసం తాను ఎన్నో ఏళ్లుగా నామ నాగేశ్వరరావు పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఈ రైల్వే లైన్ కోసం ఎన్నో సార్లు ప్రధాన మంత్రిని,రైల్వే మంత్రిని కలసి, లేఖలు అందజేయడం జరిగింది. ఫలితంగా నత్తుపల్లి వరకు రైల్వే మార్గాన్ని పూర్తి చేసి, ప్రారంభించిన కేంద్రం కొవ్వూరు వరకు రైల్వే లైన్ ను పొడిగించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నామ పేర్కొన్నారు.ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇస్తూ రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రాల వారీగా కాకుండా జోన్ల వారీగా మంజూరు చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే వెబ్సైట్లో పొందుపర్చినట్లు చెప్పుకొచ్చారు. భద్రాచలం రోడ్ – సత్తుపల్లి రైల్లే లైన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కొంత పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, పెండింగ్ లో ఉందన్నారు. భూసేకరణ, అటవీ శాఖ క్లియరెన్స్, నహ భాగస్వామ్యం,అందుకు సంబంధించిన వాటా మొత్తాన్ని జమ చేయడం, చట్టబద్ధమైన అనుమతులు, భౌగోళిక పరిస్ధితులు తదితర అంశాలపై ఆధారపడి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కానీ మంత్రి సమాధానంలో కొత్త ప్రాజెక్టుల వివరాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, నిధుల వివరాలు అడిగితే వెల్లడించలేదని నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.