సాక్షిత : తిరుపతిలోని శ్రీనివాస నిలయం, మాధవ నిలయంలోకి ఆర్టీసి బస్టాండ్ వైపు నుండి వెలుతున్న సబ్ వేని మరింత పొడిగించి శ్రీనివాసంలోకి తీసుకెల్లెలా చూడాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, టిటిడి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావును కోరారు. తిరుపతి శ్రీనివాసం, మాధవనివాసం పరిసరాలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కపిలతీర్థం నుండి బస్టాండ్ వైపుగా శ్రీనివాససేతుపై వస్తున్న వాహనాలు శ్రీనివాసం ముందర క్రిందనున్న రోడ్డుపైకి దిగడం వలన అక్కడున్న ప్రయాణికులకు, శ్రీనివాసంకు వచ్చే భక్తులకు ప్రమాధాలు జరిగే అవకాశం వున్నందున, ప్రస్థుతం శ్రీనివాసంలోకి వెల్లే గేటును మూసివేసి దక్షిణం వైపు గేటును నిర్మించడం, అదేవిధంగా ఉత్తరం వైపు వున్న గేటును ఉపయోగించుకోవాలని టిటిడి అధికారులకు తెలపడం జరిగిందన్నారు. ఆర్టీసి బస్టాండ్ నుండి శ్రీనివాసంలోకి వచ్చే భక్తుల కోసం నిర్మించిన సబ్ వేని ఆధునికరించి శ్రీనివాసం లోపలికి వెల్లేలా నిర్మించాలని కోరడంతో అధికారులు ఆమోదం తెలపడం జరిగిందని, త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమరనాధ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఆఫ్కాన్ స్వామి పాల్గొన్నారు.