ప్రభుత్వ పాఠశాలల్లో 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి

Sakshitha news

ప్రభుత్వ పాఠశాలల్లో 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి….

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి, ఈ విద్యా సంవత్సరానికి నిర్దేశించిన 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జీరో నమోదు, 15 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత పాఠశాలలు డ్రాప్‌బాక్స్‌లో వెంటనే స్వీకరించి సకాలంలో క్లియర్ చేయాలని ఆదేశించారు. డ్రాప్‌బాక్స్‌లో ఎలాంటి పెండింగ్‌లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

నిబంధనలు పాటించని, అధికారులకు సహకరించని ప్రైవేట్ పాఠశాలలకు వివరణ కోరుతూ అవసరమైన చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) ద్వారా హాజరు లేదా “ఆన్ డ్యూటీ” నమోదును తప్పనిసరిగా చేయాలని తెలిపారు. సెలవులో ఉన్న ఉపాధ్యాయుల దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలని సూచించారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, హాజరు నమోదులో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి మల్లేష్ గౌడ్, మండల విద్యాధికారులు, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

Scroll to Top