ఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి.. అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ రెండవ వారం నాటికి ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం పూర్తి కావాలని తెలిపారు. జూన్ చివరి వరకు మంజూరైన ఉపాధి హామీ పనులను ప్రత్యేక శ్రద్ధతో గ్రౌండింగ్ చేస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి జిల్లా భవనం పనులను పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య, డీఆర్డీవో కాళిందిని, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్, డీఈలు, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
