రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ లేదు…
శాఖల సమన్వయంతో ప్రమాదాల నియంత్రణ
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు…
–పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి,రామగుండం/
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ, శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ఇసుక, బొగ్గు, బూడిద వంటి లోడ్లను తరలించే వాహనాలు తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లతో కప్పి తరలించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇతర ప్రయాణికులను తరలించే ఆటోలు, రవాణా వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలు వినియోగించడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ముగ్గురు ప్రయాణించడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటి చర్యలపై ఎలాంటి రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే రహ్-వీర్ పథకంతో పాటు ప్రమాదం జరిగిన తొలి గంట అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పోలీసు శాఖ, రవాణా శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా రవాణా అధికారి గోపీకృష్ణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనన్, మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.


