పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…
ఎన్టిపిసి కోప్టా చట్టం అమలులో కఠిన చర్యలు తప్పవు….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
జిల్లాలో కోప్టా చట్టం-2003 అమలును పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీతో కలిసి ఎన్‌టీసీపీ & కోప్టా చట్టం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోప్టా చట్టం అమలు అత్యంత అవసరమని, అన్ని శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల సమీపంలోని దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని తెలిపారు. పోలీసు శాఖ సహకారంతో జూనియర్ కళాశాలలు, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు వంటి ప్రజా ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై వెంటనే జరిమానాలు విధించాలని ఆదేశించారు. అదే తప్పును పునరావృతం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి నెలా గ్రౌండ్ లెవల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్ట అమలును పర్యవేక్షించాలని సూచించారు.
అన్ని పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరికలు తప్పనిసరిగా ఉండాలని, కోప్టా చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
