SAKSHITHA NEWS

ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత …అందరూ మనవాళ్లే

…….

సాక్షిత : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత…అందరూ మనవాళ్లు గానే భావించి…పారదర్శకంగా పరిపాలన అందించడమే తన లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో రూ.37.65 లక్షల వ్యయంతో నిర్మించిన కుంటముక్కల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (సొసైటీ) మొదటి అంతస్థును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు , కేడీసీసీబీ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్రరాణా తో కలసి మంగళవారం ప్రారంభించారు. కుంటముక్కల సొసైటీ పరిధిలో చిననందిగామ, గుర్రాజుపాలెం, కుంటముక్కల గ్రామాల్లోని రైతులకు సేవలందిస్తున్నారు.

సొసైటీ అధ్యక్షులు పాటిబండ్ల మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సభలోఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక పరిపుష్టికి సొసైటీ పాలకవర్గాలు కృషిచేయాలన్నారు.

కుంటముక్కల గ్రామంలో చెరువు కట్ట అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ మండల పరిషత్తులో తీర్మానం చేశారని రైతుల విజ్ఞప్తి మేరకు త్వరలో పనులు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

కుంటముక్కల గ్రామంలో ఇళ్లస్థలాలు 150 మందికి భూమి కొనుగోలు చేసి ఇచ్చామని, ఇంకా కొంతమందికి స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. అధికారులతో మళ్ళీ వెరిఫికేషన్ చేయించి అర్హులకు ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు.

సౌలభ్యాన్ని బట్టి సీనియర్ నాయకులు పామర్తి వెంకట నారాయణ నివాసం వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణకు సీఎం జగన్మోహన్ రెడ్డి ని తీసుకువస్తానన్నారు.

కువిమర్శలు, విద్వేషాలు పక్కనబెట్టి అన్నదమ్ముల్లా కలసిమెలసి పార్టీలకు అతీతంగా కమిటీ ఏర్పాటు చేసుకుని, తద్వారా కుంటముక్కల గ్రామాభివృద్ధికి ఐకమత్యంగా పాటుపడాలన్నారు.

కుంటముక్కల గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ నిర్మాణాలకు ఎంతో విలువైన తన స్వంత 25 సెంట్ల స్థలాన్ని వితరణగా ఇవ్వనున్నట్లు సొసైటీ చైర్మన్ పాటిబండ్ల మధుసూదనరావు సభలో ప్రకటించారు. ఆయన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అభినందించారు.

మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేసి డ్రెయిన్లు, సిమెంట్ రహదారులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, సొసైటీ భవనాలు, ప్రధాన రహదారులు నిర్మించినట్లు పేర్కొన్నారు.


SAKSHITHA NEWS