త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో శిక్షణ
జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్
శ్రీకాకుళం :
ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు – 2024లకు సంబంధించి (ఎఎల్ఎంటి) మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ తరగతులలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు ముందుగా మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, వివి పేడ్స్, ఈవిఎంలు, తదితర వాటిపై వివరించారు.
ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. త్వరలోనే నియోజక వర్గాల వారీగా శిక్షణ ఇస్తామన్నారు. ఇవిఎంలు, బ్యాలెట్ యూనిట్, తదితర వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణా తరగతులకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.
మెప్మా పిడి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ కిరణ్ కుమార్ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు, ప్రెసైడింగ్ ఆఫీసర్ డైరీ, తదితర అంశాలపై వివరించారు. మొత్తం ఓటర్లు, పార్లమెంటు, శాసన సభలకు సంబంధించి వేర్వేరుగా ఏజంట్లు ఉంటారని, అభ్యర్థుల పేర్లు క్లియర్ గా కనిపించే విధంగా చూడాలన్నారు. మాక్ పోలింగ్ ఓట్లు సరిపోయినది లేనిది చూడాలని చెప్పారు. పోలింగ్ పర్సనల్ మేనేజ్ మెంట్, మాక్ పోలింగ్ పై అందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి నియోజకవర్గ స్థాయిలో శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు.పోస్టల్ బ్యాలెట్ పై డ్వామా పీడీ, మాస్టర్ ట్రైనర్ చిట్టిరాజు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇన్ చార్జ్ డిఆర్ఓ రామ్మోహనరావు, పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఈఆర్వోలు, ఎఈఆర్వోలు, ఎలక్షన్ డిటీలు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్, తదితరులు పాల్గొన్నారు.