స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు నిర్వహిస్తున్న కిరాణం, డైరీ, తదితర యూనిట్లను సందర్శించి, యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో యూనిట్ల అభివృద్ధి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్ మంజూరుకు ముందు కుటుంబ పరిస్థితి, ఆదాయం, యూనిట్ మంజూరుతో నిర్వహణ ఆదాయం గురించి వివరాలు తెలుసుకున్నారు. అనుభవం ఉన్న యూనిట్లను ఎంచుకోవడం వల్ల నిర్వహణ సులభతరమయి మంచి ఆదాయం వస్తుందన్నారు.
యూనిట్లతో ఆర్ధికంగా అభివృద్ధి చెందడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలన్నారు. దళితలందరూ ఆర్ధికంగా బలోపేతం అవడం వల్ల తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని ఆమె ఆన్నారు. తమకు కేటాయించిన యూనిట్లను తామే నిర్వహించుకోవాలని ప్రభుత్వ కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని, ఇతరు లీజుకు ఇవ్వడం వంటి చర్యలు చేయరాదని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, ఎం.పి.ఓ రవీందర్, అధికారులు తదితరులుతదితరులు ఉన్నారు.