మీడియా ఎల్లప్పుడూ బాధితుల పక్షాన్నే నిలవాలి : డాక్టర్ కృష్ణ బంటు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి అవసరమని బాధితుల పక్షాన ఎల్లప్పుడూ మీడియా నిలబడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టి యు డబ్ల్యూ జే- ఐజేయు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. ఎస్ఎన్ 9 న్యూస్ ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విలువలతో కూడిన జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్ గా ఎస్ఎన్ 9 ఛానల్ బాధితులకు అండగా ఉందని, నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేయడంలో అగ్రభాగాన ఉందని పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిల్చుని అనేక వార్తా కథనాలు ఎస్ఎన్ 9 ఛానల్ లో ప్రసారం చేసి బాధితుల కష్టాలు తీర్చడంలో ముందుందని కొనియాడారు.
ఛానల్ అనతి కాలంలోనే అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం హర్షనీయమన్నారు. చానల్ సీఈవో, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే పాషా జర్నలిజం రంగంలో తనకున్న అనుభవంతో, మానవతా దృక్పథంతో మంచి మంచి కథనాలను ప్రసారం చేసి మరుగున పడ్డ అనేకమంది పలు రంగాలకు చెందిన నిష్ణాతులు, సామాజిక సేవకుల జీవితాలను వెలుగులోకి తేవడం అభినందించదగ్గ విషయం అన్నారు. సంఘటన ఎక్కడ జరిగినా, సందర్భం ఏదైనా అన్ని రకాల కార్యక్రమాలను వెంటనే ప్రసారం చేసి వీక్షకుల హృదయాలను, ప్రజల ఆదరాభిమానాలను ఎస్ ఎన్ 9 ఛానల్ దక్కించుకోవడం గర్వకారణం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛానల్ సీఈవో ఎస్ కే పాషా, టియుడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, జర్నలిస్టులు నందిపాటి సైదులు, ప్రభు కుమార్, ఆసిఫ్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు