SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులకు కలెక్టర్ మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్ అధికారుల నియామకం చేసి, వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. సెక్టార్ అధికారులు రిటర్నింగ్ అధికారులకు కేటాయించబడతారన్నారు.

సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారికి క్షేత్ర స్థాయిలో కళ్ళు, చెవుల వాటి వారన్నారు. ఒక్కో రిటర్నింగ్ అధికారి క్రింద 20 నుండి 30 సెక్టార్లు వుంటాయని, ఒక్కో సెక్టార్ అధికారికి 10 నుండి 20 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందని అన్నారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తారన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని వసతులు, ఓటర్లకు అనుకూలతలు పరిశీలించాలని అన్నారు.

తమ పరిధిలోని ప్రాంతంలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. బూత్ లెవల్ అధికారులు, తహసీల్దార్, ఎంపిడివో, ఎస్హెచ్ఓ లను పరిచయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించి, సమస్యలు చర్చించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమని, ఎన్నికలకు ఎలక్టోరల్, ఇవిఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమని కలెక్టర్ అన్నారు. ప్రతి ఎన్నికలు క్రొత్తగానే చూడాలని, ఏ దశలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదని, ప్రతి దశను సీరియస్ గా తీసుకోవాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, ఇవిఎం ల నిర్వహణ పై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించి, ఇవిఎం లపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS